తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు

బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక తుది అంకానికి చేరింది. నేడో రేపో పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించడానికి పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం.

Update: 2025-03-25 02:27 GMT
తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ స్టేట్ చీఫ్ ఎంపిక తుది అంకానికి చేరింది. నేడో రేపో పార్టీ అధ్యక్షుడి పేరు ప్రకటించడానికి పార్టీ జాతీయ నాయకత్వం సిద్ధమైంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడి పేరుపై ఇప్పటికే అధినాయకత్వం ఒక అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే, పేరు ప్రకటించడానికి సమయం తీసుకున్నట్టుగా సమాచారం. బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగ్గా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటిగా ఆ పార్టీ అగ్రనాయకత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడిని అచితూచి ఎంపిక చేయాలని నిర్ణయించారు.

అధ్యక్ష ఎన్నికకు ఇన్‌చార్జిగా శోభకారంద్లాజే

పార్టీని పవర్‌లోకి తీసుకవచ్చే నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోవడం, అన్ని ప్రాంతాలకు సుపరిచితుడై, స్థాయి, హోదా ఉన్న నాయకుడిని స్టేట్ చీఫ్‌గా ఎంపిక చేయాలని అధిష్ఠానం నిర్ణయించినట్టుగా తెలిసింది. దీనిలో భాగంగా అధ్యక్షుడి పేరును, రాష్ట్రానికి చెందిన కీలక నేతలైన కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్​, కేంద్ర మంత్రి బండి సంజయ్‌​లకు చెప్పి వారితో నామినేషన్​ వేయించాల్సిందిగా సూచిస్తారని సమాచారం. కేంద్ర మంత్రి శోభకారంద్లాజేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు, సంస్థాగత ఎన్నికలకు ఇన్‌చార్జిగా నియమించారు. ఈ నేపథ్యంలో ఆమె హైదరాబాద్‌​కు వచ్చి అధినాయకత్వం సూచించిన నాయకుడి నుంచి నామినేషన్​ స్వీకరిస్తారు. అనంతరం ఒక్కటే నామినేషన్​ దాఖలు అయినందున అధ్యక్షుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కేంద్ర నాయకత్వం అధికారికంగా ప్రకటిస్తుంది. ఇదంతా అధికారిక ప్రక్రియ అని పార్టీ కీలక నేతలు చెబుతున్నారు.

స్టేట్ చీఫ్ పోస్టుకు పోటీలో ఎంపీలు

పార్టీలో కొత్త-పాత, బీసీ-ఓసీ ఈక్వేషన్స్​ మధ్య అధ్యక్షుడి పోటీ నడుస్తోందని పార్టీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రిగా రెడ్డి ఉన్నందున ఆ వర్గానికి ఎంత వరకు అధ్యక్ష పదవి ఇస్తారనే సందేహాన్ని పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో అన్ని వర్గాలకు సమన్యాయం చేయడం, మిగిలిన వర్గాలకు కూడా న్యాయం చేయడం అవసరమని ఉద్దేశంతో బీసీలకు ఇవ్వవచ్చని విశ్లేషిస్తున్నారు. కీలకమైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరవుతారని ఆ పార్టీ కేడర్‌​తో పాటుగా నాయకులు, ఇతర పార్టీల నేతలు ఆసక్తి‌గా ఎదురుచూస్తున్నారు. అధ్యక్షుడి ఎంపిక ఉత్కంఠను రేపుతోంది. ప్రధానంగా అధ్యక్ష పదవికి పోటీలో ఎంపీలు ముందుండటం విశేషం. ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ఎంపీలందరూ తమకు పార్టీ అధ్యక్షుడి పోస్ట్ కావాలని ఆశతో ఉన్నారు. ఆశావాహ దృక్పథం తో ఉన్నారు. అధ్యక్షుడి ఎన్నిక​ అనంతరం కేంద్ర మంత్రివర్గంలోకి మరొకరికి చాన్స్ ఉందని సమాచారం.

Similar News