రైతుల ఖాతాల‌పై సైబ‌ర్ క‌న్ను..! రెచ్చిపోతున్న కేటుగాళ్లు

రైతుల బ్యాంకు ఖాతాలను వినియోగిస్తూ సైబ‌ర్ నేర‌గాళ్లు దోపిడీకి పాల్పడ్డారా..? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.

Update: 2025-03-25 01:45 GMT
రైతుల ఖాతాల‌పై సైబ‌ర్ క‌న్ను..! రెచ్చిపోతున్న కేటుగాళ్లు
  • whatsapp icon

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/ మంగ‌పేట‌ : రైతుల బ్యాంకు ఖాతాలను వినియోగిస్తూ సైబ‌ర్ నేర‌గాళ్లు దోపిడీకి పాల్పడ్డారా..? అంటే అవున‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. రైతుల‌ వాట్సాప్‌ల‌కు ఏపీకే ఫైల్స్ పంపి ఇన్‌బిల్ట్ వైర‌స్ ద్వారా సాఫ్ట్‌వేర్‌ను చొప్పించి ఫోన్లను హ్యాక్ చేసిన ప‌ర్సన‌ల్ డేటాను కొళ్లగొట్టిన దుండగులు బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేశారు. అంతేకాకుండా ఆ రైతుల ఖాతాల‌ను వినియోగించుకుంటూ సైబ‌ర్ నేరాల‌కు పాల్పడిన‌ట్లుగా తెలుస్తోంది. ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని క‌మ‌లాపూర్‌లోని మూడు జాతీయ బ్యాంకుల్లోని రైతులు, చిరు వ్యాపారుల బ్యాంకు ఖాతాలను సైబ‌ర్ నేర‌గాళ్లు ఆప‌రేట్ చేస్తున్న ఘ‌ట‌న‌లు ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇప్పటి వ‌ర‌కు అందిన స‌మాచారం ప్రకారం.. ఒక్క మంగపేట మండ‌లంలోనే దాదాపు 100 మంది ఖాతాదారుల‌ను సైబ‌ర్ నేర‌గాళ్లు ఆప‌రేట్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది రైతులు ఉండ‌గా కొంత‌మంది చిరు వ్యాపారులు ఉన్నారు. ఇటీవ‌ల రైతుభ‌రోసా డ‌బ్బులు జ‌మ కావ‌డంతో డ్రా చేసుకునేందుకు వెళ్లిన రైతుల‌కు ఈ విష‌యం తెలిసింది. స‌ద‌రు రైతులు, వ్యాపారుల ఖాతాల‌ను ప్రస్తుతానికి సీజ్‌చేసిన‌ట్లు బ్యాంకు అధికారులు వెల్లడిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

బెట్టింగ్ ఎకౌంట్లు హోల్డ్.. ఆందోళనలో ఖాతాదారులు

ములుగు జిల్లా మంగ‌పేట మండలంలోని నాలుగు జాతీయ బ్యాంకుల్లోని సైబర్ నేరగాళ్లకు చెందిన సుమారు వందకు పైగా బ్యాంకు ఖాతాలను అధికారులు హోల్డ్ లో పెట్టినట్లు సమాచారం. కమలాపురంలోని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మంగపేటలోని యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా, మల్లూరులోని ఏపీజీవీబీ, రాజుపేటలోని కెనరా బ్యాంకుల పరిధిలో ఈ ఖాతాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు సైబర్ నేరగాలు దేశ వ్యాప్తంగా సెల్ ఫోన్లకు కంపెనీల, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంకు అధికారులమంటూ ఫోన్లు చేసి మాట్లాడుతూ ఓటీపీలు తెలుసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతుండడంతో లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్న ఖాతాదారులు దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సైబర్ నేరగాళ్లు మంగపేట మండలంలో సుమారు వందకు పైగా ఉండి అలాంటి ఖాతాలు సైబర్ క్రైం సెంట్రల్ వైజ్డ్ ఐటీ సెల్ ఫిర్యాదు మేరకు వాటిని గుర్తించి ఖాతాలను సీజ్ చేయడం సంచలనం కలిగించింది. మండలంలోని సైబర్ నేరగాళ్ల ఖాతాలు సీజ్ కావడంతో మండలంలోని ఓ జాతీయ బ్యాంకుకు ఖాతాదారులు సోమవారం రావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల కింద సీజ్ అయిన ఖాతాదారులు తమ ఖాతాల్లో ప్రభుత్వం వేసిన రైతుబంధు, పీఎం కిసాన్ యోజన డబ్బులు డ్రా చేయడానికి వచ్చి సీజ్ విషయాన్ని మేనేజర్ దృష్టికి తేవడంతో ఖాతాలను పరిశీలించిన మేనేజర్ ఖాతాలు సెంట్రల్ వైజ్డ్ ఐటీ సెల్ కంప్లైంట్ మేరకు సీజ్ అయ్యాయని చెప్పి మిగతా విషయాలు జిల్లా కేంద్రంలోని సైబర్ క్రైం పోలీసులను సంప్రదించాలని చెప్పినట్లు తెలిసింది. మండలంలో వెలుగులోకి వచ్చిన సైబర్ క్రైం నేరగాళ్ల గురించి ఆ నోటా ఈ నోటా తెలియడంతో మండల ప్రజలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ విషయమై పలువురు మేనేజర్లను దిశ సంప్రదించగా నిజమేనని తెలిపారు.

సైబ‌ర్ నేరంలో కొత్త కోణం..?!

ములుగు జిల్లా మంగ‌పేట మండ‌లంలోని బ్యాంకుల్లో వెలుగులోకి వ‌చ్చిన కొత్తర‌కం సైబ‌ర్ క్రైంపై రాష్ట్ర స్థాయి అధికారులు దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. ఒక్క మండ‌లంలోనే 100 మంది బాధితులు ఉన్నట్లుగా తెలుస్తుండ‌గా.. ఇదే త‌ర‌హా సైబ‌ర్ క్రైం మిగ‌తా జిల్లాల్లో జ‌రిగాయా..? అన్న కోణంలోనూ విచార‌ణ జ‌రుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదే విష‌యంపై పోలీసుల వివ‌ర‌ణ కోరే ప్రయ‌త్నం చేయ‌గా స్పందించ‌లేదు.


Similar News