వరంగల్‌లోనే బీఆర్ఎస్ సభ
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వరంగల్‌లోనే నిర్వహించనున్నారు.

దిశ, వరంగల్ బ్యూరో : బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభ వరంగల్‌లోనే నిర్వహించనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్‌ను మంగళవారం వరంగల్ జిల్లా నేతలు ఎర్రవెల్లిలోని ఫాం హౌస్‌లో కలవగా స్పష్టత నిచ్చారు. రజతోత్సవ సభను వరంగల్‌లోనే 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని స్వయంగా మాజీ మంత్రి హరీష్‌రావు తెలియజేశారు.
ఇటీవల హన్మకొండ జిల్లాలోని భట్టుపల్లి, ఉనికిచర్ల ప్రాంతాల్లోని రెండు చోట్ల సభా స్థలాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్దిసుదర్శన్‌రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీస్‌బాబు, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ టి.రాజయ్య, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలిసి పరిశీలన చేశారు.
వరంగల్ రింగ్ రోడ్డుకు, హైదరాబాద్, కరీంనగర్ జాతీయ రహదారులకు ఆనుకొని ఉండటం సభకు అనుకూలిస్తుందని ఉనికిచర్ల సభా స్థలిని దాదాపు ఖరారు చేశారు. అయితే ఇటీవల మేడ్చల్‌లో నిర్వహించాలని కేసీఆర్ యోచిస్తున్నట్లుగా వార్తలు రావడంతో వరంగల్ జిల్లా నేతలు మంగళవారం కేసీఆర్‌ను కలవడంతో స్పష్టత వచ్చింది. వరంగల్‌లోనే రజతోత్సవ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.
మూడు జిల్లాల సరిహద్దులో సభ..!
ఉమ్మడి జిల్లాలైన వరంగల్, మెదక్, కరీంనగర్ జిల్లాల సరిహద్దు మండలంగా ఉన్న ఎల్కతుర్తి మండలకేంద్రానికి సమీపంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈమేరకు ఎస్సార్ యూనివర్సిటీకి సమీపంలోని సుమారు 1500 ఎకరాల స్థలంలో సభకు ఏర్పాట్లు చేయనున్నారు.
ఈమేరకు బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్‌విప్, మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డి, హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ బాబు, రైతు విమోచన సమితి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నాగుర్ల వెంకటేశ్వర్లుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు క్షేత్రస్థాయిలో పర్యటించారు. సభా నిర్వహణకు అవసరమైన భూమిని రైతుల నుంచి ఒప్పించి తీసుకోవడం గమనార్హం.
ఉనికిచర్లలో సభా స్థలం సరిపోదనే : మాజీ ఎమ్మెల్యే పెద్ది
రజతోత్సవ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులను, పార్టీ అభిమానులను ఆహ్వానిస్తున్నాం. లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉంది. ఎన్నికల తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పాల్గొంటున్న తొలి సభ కావడంతో జనం పెద్ద ఎత్తున తరలివస్తారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ సభ చరిత్రలో మిగిలిపోనుంది. ఆ స్థాయిలోనే సభకు వచ్చే జనాలకు ట్రాఫిక్, తాగునీటి, పార్కింగ్ ఇతరత్రా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మాజీ మంత్రి హరీష్‌రావు సారథ్యంలో సభా ఏర్పాట్లు చేపడుతున్నాం.