ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నాడు.. ఎస్పీ, డీఎస్పీ కాపాడండి.. వీడియో ద్వారా ప్రేమ జంట వేడుకోలు

అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఎస్ఐ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ ప్రేమ జంట వీడియో విడుదల చేసింది.

Update: 2025-03-26 14:44 GMT
ఎస్ఐ ఇబ్బంది పెడుతున్నాడు.. ఎస్పీ, డీఎస్పీ కాపాడండి.. వీడియో ద్వారా ప్రేమ జంట వేడుకోలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి ఎస్ఐ మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపణలు చేస్తూ.. సోషల్ మీడియాలో ఓ ప్రేమ జంట వీడియో విడుదల చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న తమని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ (Jayashankar Bhupalpally SP), డీఎస్పీ (DSP) తమని కాపాడాలని ఆ ప్రేమ జంట కోరారు. ఈ వీడియోలో.. రేగొండ మండలం (Regonda Mandal) దుంపిల్ల పల్లి (Dumpilla pally)కి చెందిన నాగరాజు, శృతి అనే మేము కొద్ది రోజుల క్రితం ఇంట్లో నుంచి బయటికి వచ్చి ప్రేమ వివాహం చేసుకున్నామని చెప్పారు.

దీంతో అమ్మాయి తల్లిదండ్రులు తమ కుటుంబంపై దాడి చేయడం వల్ల వారిపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యిందని తెలిపారు. అనంతరం ఎస్ఐ సందీప్ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కి రావాలని చెప్పడంతో వెళ్లామని, అక్కడ కొందరు పెద్దమనుషుల సమక్షంలో ఎస్ఐ.. మీకు మళ్లీ హిందూ సాంప్రదాయం ప్రకారం వివాహం జరిపిస్తారని, ఇంటికి వెళ్లాలని సూచించినట్లు తెలిపారు. వారు మమ్మల్ని నమ్మించి విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిసి, మాకు ఇప్పటికే వివాహం జరిగిందని, మళ్లీ వివాహం చేసుకోమని చెప్పి వచ్చామని అన్నారు.

అప్పటినుంచి ఎస్ఐ సందీప్ సహా పెద్దమనుషులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతేగాక మళ్లీ అమ్మాయి తల్లిదండ్రులు మా తండ్రిపై దాడి చేశారని, దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఎస్ఐ విచారణ పేరుతో మా నాన్నను స్టేషన్ కు పిలిచి, తమ గురించి ఆరా తీస్తున్నాడని యువకుడు వాపోయాడు. అమ్మాయి తల్లిదండ్రుల వల్ల తమకు ప్రాణహాని ఉందని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ, డీఎస్పీ తమకు రక్షణ కల్పించి, కాపాడాలని కోరారు. ఇక అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ఈ దాడులు ఇలాగే కొనసాగితే ఎస్ఐ సహా పలువురు పెద్ద మనుషులు వల్ల తాము ఆత్మహత్యకు పాల్పడాల్సి వస్తుందని యువకుడు తెలిపాడు.  

Tags:    

Similar News