నియోజకవర్గాల్లో సమస్యలు.. స్పీకర్‌కు కీలక విజ్ఞప్తులు
నియోజకవర్గాల్లో సమస్యలపై తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్‌కు ఎమ్మెల్యేలు కీలక విజ్ఞప్తులు చేశారు..

దిశ, తెలంగాణ బ్యూరో: ‘‘ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పాలసీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎంతసేపూ హైదరాబాద్ మీదే ఫోకస్ పెడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ వనరులు అందుబాటులో ఉన్నాయి. వాటి మీద కూడా దృష్టి సారించాలి. అలాగే సూర్యాపేట జిల్లాకు ధర్మభిక్షం పేరు పెట్టాలి. స్లమ్ ఏరియాల డెవలప్‌మెంట్ కోసం స్పెషల్ ఫండ్ ఏర్పాటు చేయాలి. పట్టణ పేదలకూ ఉపాధి హామీ పథకం అమలయ్యేలా చూడాలి.’’ అని తెలంగాణ అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
జనగామ హాస్పిటల్‌లో సీటీ స్కాన్ లేదు: పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
‘జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్ లేదు. అలాగే.. పలు పరికరాలు కూడా లేవు. పర్సన్స్ లేరు. వెంటనే అక్కడ సీటీ స్కాన్ ఏర్పాటు చేయండి. అవసరమైన పరికరాలను ఇవ్వండి. అలాగే.. చెర్యాల హాస్పిటల్ వర్క్స్ మధ్యలోనే ఆగిపోయాయి. వెంటనే వాటిని పూర్తిచేయండి. అలాగే.. ధర్మసాగర్ పంపు సెట్లు బంద్ పెట్టడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి. వెంటనే ఆ పంపులను ఆన్ చేసి నీరందించాలి.’ అని విజ్ఞప్తి చేశారు.
చేప పిల్లల కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి: గండ్ర సత్యనారాయణ, భూపాలపల్లి ఎమ్మెల్యే
గత ప్రభుత్వం హయాంలో చేపపిల్లల పంపిణీలో భారీ అక్రమాలు చోటుచేసుకున్నాయి. అధికారులతో కాంట్రాక్టర్ కుమ్మక్కై భారీగా నిధులు కాజేశారు. కాంట్రాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అటవీ శాఖ భూముల విషయంలోనూ ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. బోర్లు వేయనీయడం లేదు. వెంటనే చర్యలు తీసుకోవాలి.
కార్యకర్తల మీద కేసులు కొట్టేయాలి: నాయని రాజేందర్‌రెడ్డి, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే
గత ప్రభుత్వం హయాంలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేశారు. చాలా మందిపై కేసులు ఉన్నాయి. నాపై కూడా మర్డర్ కేసు పెట్టే ప్రయత్నం చేస్తే కోర్టుకు వెళ్లి బయటపడ్డా. ఇప్పుడు పార్టీలో పదవులు కావాలంటే.. మీపై కేసులు ఉన్నాయి కదా అని అంటున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు రాకుండా పోతున్నది. వెంటనే వాటిని కొట్టేయాలి. అలాగే.. పార్టీ కార్యాలయాల పేరిట గతంలో కబ్జాలకు గురైన భూముల వివరాలు బయటపెట్టాలి. పార్టీ కార్యాలయాలకు సంబంధించి ట్యాక్సులు కూడా పే చేయడం లేదు. ఒకసారి దృష్టి సారించి వసూలు చేయాలి.
భూముల కబ్జాపై ఫోకస్ చేయాలి: మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే
మా ఏరియాలో భూములు కబ్జాకు గురవుతున్నాయి. కబ్జాకు గురవుతున్నాయని కలెక్టర్‌కు లెటర్ ఇచ్చినా చర్యలు లేవు. నేరేడుమేట్‌లో గవర్నమెంట్ ల్యాండ్ చెరబట్టారు. భూదాన్ భూముల్లో ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఈ కబ్జాలను హైడ్రా పట్టించుకోదా..?
స్పోర్ట్స్ గ్రౌండ్ పనులు కంప్లీట్ చేయండి: పాడి కౌశిక్‌రెడ్డి
మా నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టిన స్పోర్ట్స్ గ్రౌండ్ పనులు 20 శాతం జరిగాయి. దీనిని వెంటనే కంప్లీట్ చేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురండి. కమలాపూర్ మండలంలో బస్టాండు కంప్లీట్ చేయాల్సి ఉంది. అలాగే ఉప్పల్‌లో రూ.45 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టాం. దానిని కంప్లీట్ చేయించాలి. అలాగే.. ఇద్దరు క్రికెటర్లు త్రిష, ద్రితికి ప్రభుత్వం ప్రోత్సహకాలు ఇచ్చింది. త్రిషకు రూ.కోటి ఇస్తే.. ద్రితికి మాత్రం రూ.10 లక్షలు ఇచ్చారు. ద్రితికి కూడా కోటి రూపాయలు ఇవ్వగలరు.
ప్రభుత్వ ఉద్యోగులకు టీఏ, డీఏలివ్వాలి: వెంకటరమణారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే
ప్రభుత్వ ఉద్యోగుల టీడీ, డీఏలు వెంటనే విడుదల చేయాలి. ఉద్యోగులు పేమెంట్ అడిగితే సమయం పడుతుందని ఈ మధ్య సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. అలా చెప్పడం వల్ల ఉద్యోగుల్లో తేడాలు వచ్చే ప్రమాదం ఉంది. అధికారులు తప్పుదారి పట్టే ప్రమాదం ఉంది. అలాగే.. రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కూడా వెంటవెంటనే క్లియర్ చేయాలి.
పంట నష్టపరిహారం ప్రకటించాలి: కసిరెడ్డి నారాయణ రెడ్డి
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మా నియోజకవర్గంలో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పటికే అధికారులకు ఆదేశాలిచ్చారని తెలిసింది. తొరగా సర్వే చేపట్టి రైతులకు పరిహారం అందించాలి. అలాగే కరెంటు స్తంభాలు సైతం పడిపోయాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద కాలువలు తవ్వారు కానీ వాటికి గండ్లు పడుతున్నాయి. వెంటనే డైవర్షన్స్ ఏర్పాటు చేయాలి. కాలువలకు గేట్‌వాల్వ్‌లు సైతం ఏర్పాటు చేయాలి. తెగిన చెరువులకు మరమ్మతులు చేపట్టాలి.
ఆస్పత్రికి టెండర్లు నిర్వహించండి: అనిల్ జాదవ్, బోథ్ ఎమ్మెల్యే
మా నియోజకవర్గం ప్రజలు పెద్దాసుపత్రికి పోవాలంటే 70 కిలోమీటర్లు పోవాలి. నిర్మల్ లేదంటే ఆదిలాబాద్ వెళ్లాల్సి ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీహెచ్‌సీని వంద పడకలుగా మారుస్తూ జీవో ఇచ్చారు. దానికి రూ.18 కోట్లు కూడా మంజూరు చేశారు. వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టి ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలి. అలాగే.. నియోజకవర్గం ఇంతవరకూ డిగ్రీ కాలేజీ లేదు. బోథ్‌లో ఏర్పాటు చేయాలి. కొత్తగా ఏర్పాటైన మూడు మండలాలకు ఇంటర్మీడియెట్ కాలేజీలు మంజూరు చేయాలి.