Rajalingamurthy: ఈ హత్యలో ఆయన ‘ఆత్మ’.. అసెంబ్లీలో రాజలింగమూర్తి హత్యపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
అసెంబ్లీలో రాజలింగమూర్తి హత్యపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన జయశంకర్ భూపాలపల్లి (Bhupalapally) జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెళ్లి రాజలింగమూర్తి హత్య (Rajalingamurthy Murder) కేసు టాపిక్ తాజాగా అసెంబ్లీలో వచ్చింది. ఈ హత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (MLA Gandra Satyanarayana Rao) ప్రభుత్వాన్ని కోరారు. ఇవాళ శాసనసభలో మాట్లాడిన ఎమ్మెల్యే.. రాజలింగమూర్తి గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై కోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు. గత ప్రభుత్వంపై ఆయనపై అనేక పోరాటాలు చేస్తే ఆయన్ను ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారన్నారని ఆరోపించారు. తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు రాజలింగమూర్తి ఫిర్యాదు సైతం చేశారని గుర్తు చేశారు. అయినా మాజీ ఎమ్మెల్యే గండ్రా వెంకటరమణారెడ్డి (Gandra Venkataramana Reddy) ఆత్మగా పిలవబడే భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా పట్టుబడి జైల్లో ఉన్నారని ఈ కేసును సమగ్రంగా విచారణ జరిపించాలని కోరారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా పోలీసుల అండదండలతో అనేక మంది కాంగ్రెస్ మండల నాయకులు, కౌన్సిలర్లపై కేసులు పెట్టించారని ఆరోపించారు. కాగా మేడిగడ్డ విషయంలో నాటి సీఎం కేసీఆర్ పైనే కోర్టులో న్యాయపోరాటానికి దిగిన రాజలింగమూర్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో దారుణ హత్యకు గురయ్యారు. నిందితుడు కత్తులతో దాడి చేసి ఆయన్ను చంపేశారు. తన భర్తను భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్రావెంకటరమణా రెడ్డినే హత్య చేయించారని రాజలింగమూర్తి భార్య సరళ బహిరంగంగానే ఆరోపిస్తోంది.