కేబీఆర్‌ పార్కు చుట్టూ జంక్షన్ల భూసేకరణకు రూ.741 కోట్లు

కేబీఆర్‌ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్ నెం.12 (విరంచి హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు) రోడ్డు విస్తరణ పనుల్లో ఆస్తుల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది.

Update: 2025-03-25 02:11 GMT
కేబీఆర్‌ పార్కు చుట్టూ జంక్షన్ల భూసేకరణకు రూ.741 కోట్లు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : కేబీఆర్‌ పార్కు చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా నిర్మించనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసుల నిర్మాణం, బంజారాహిల్స్ రోడ్ నెం.12 (విరంచి హాస్పిటల్ నుంచి కేబీఆర్ పార్క్ వరకు) రోడ్డు విస్తరణ పనుల్లో ఆస్తుల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారింది. ఆరు జంక్షన్లో చేపట్టనున్న ఫ్లైఓవర్లు, అండర్ పాసులకు రూ.1,090 కోట్లు, విరంచీ ఆస్పత్రి జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ వరకు 6.50 కిలోమీటర్ల వరకు రోడ్డు విస్తరణకు రూ.150 కోట్లు మొత్తం రూ.1,240 కోట్లు అవుతాయని అధికారులు అంచనా వేశారు. వీటిలో భూసేకరణకు సగానికి ఎక్కువ నిధులు రూ.741 కోట్లు ఖర్చవుతుందని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. భూసేకరణకు ఖర్చు చేయడానికి జీహెచ్ఎంసీ ఖజానాలో నిధుల్లేక పోవడంతో ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. భూసేకరణ అంశం కొలిక్కి వస్తేనే ప్రాజెక్టు పనులు ముందుకు పోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

229 ఆస్తుల గుర్తింపు..

కేబీఆర్ చుట్టు జంక్షన్ల అభివృద్ధితో పాటు విరంచీ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టులో మొత్తం 229 ఆస్తులను గుర్తించారు. ఈ ప్రాపర్టీలు 56,621.30 చదరపు గజాల విస్తీర్ణం ఉన్నాయి. విరంచీ ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్ వరకు 6.50 కిలో మీటర్ల పొడవు 100 ఫీట్ల నుంచి 120 ఫీట్ల వరకు రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ మార్గంలో 81 ఆస్తులను సేకరించాలని అధికారులు గుర్తించారు. కేబీఆర్ పార్కు ఎంట్రెన్స్, ముగ్ద జంక్షన్ల పరిధిలో 40, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ 47, మహారాజా అగ్రసేన్ జంక్షన్‌లో 34, ఫిల్మ్‌నగర్ జంక్షన్‌లో 43, రోడ్డు నం.45 జంక్షన్‌లో 36, కాన్సర్ ఆస్పత్రి జంక్షన్‌లో 18 ఆస్తులను సేకరించాల్సి ఉంది.

టీడీఆర్‌కు 10 శాతం..

జీహెచ్ఎంసీ చేపట్టనున్న ప్రాజెక్టుల్లో స్థలం కోల్పోతే భూసేకరణ చట్టం ప్రకారం అయితే మార్కెట్ రేటు ఆధారంగా భూమికి రెండింతలు, నిర్మాణానికి రెండింతలు చెల్లించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. అదే టీడీఆర్ అయితే (ఉదా.20 గజాల స్థలం కోల్పోతే 80 గజాల స్థలానికి టీడీఆర్ ఇస్తారు) నాలుగింతల టీడీఆర్ ఇవ్వనున్నారు. దీన్ని 2017 లో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేబీఆర్ ప్రాజెక్టుల కోసం 56,621.30 చదరపు గజాల స్థలాన్ని సేకరించాల్సి ఉందని అధికారులు గుర్తించారు. అయితే దీనిలో 10 శాతం ప్రాపర్టీలకు సంబంధించిన యజమానులు టీడీఆర్ తీసుకోవడానికి సముఖత వ్యక్తం చేసినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు అంచనా వేశారు.

భూసేకరణకు రూ.741 కోట్లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ జంక్షన్ల అభివృద్ధిలో భాగంగా ఆరు ఫ్లైఓవర్లు, ఏడు అండర్ పాసుల నిర్మాణం తో పాటు విరించి ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వరకు రోడ్డు విస్తరణ చేపట్టడానికి రూ.1,240 కోట్ల వ్యయం అయితే భూసేకరణకు రూ.741 కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు తయారు చేశారు. రోడ్డు విస్తరణ కోసం సేకరించే ఆస్తులకు రూ.200 కోట్లు అవుతుందని అధికారులు చెబుతున్నారు. రోడ్డు నెం.45 జంక్షన్ వద్ద ఆస్తులు సేకరించడానికి రూ.125 కోట్లు, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద రూ.115 కోట్లు, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి ఫిల్మ్ నగర్ జంక్షన్ వరకు రూ.105 కోట్లు అవుతుందని అంచనాలు తయారు చేశారు.

జంక్షన్ పేరు కి.మీ కోల్పోతున్న ఆస్తులు విస్తీర్ణం(చ.గ) విలువ(రూ.కోట్లలో)

కేబీఆర్ ఎంట్రెన్స్, ముగ్ద జంక్షన్ 1.8 40 7,884.21 60

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ జంక్షన్ 02 47 13,390.48 115

రోడ్డ నం.45 నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ 1.20 36 6,249.65 125

ఫిల్మ్‌నగర్ జంక్షన్ 1.40 43 9,927.82 105

మహారాజా అగ్రసేన్ జంక్షన్ 1.20 34 5,531.14 76

కాన్సర్ ఆస్పత్రి జంక్షన్ 1.20 18 13,638 60

విరంచీ ఆస్పత్రి జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్డు విస్తరణ 6.50 81 200

మొత్తం 15.3 299 56,621.30 741


Similar News