అవి అమలు చేయకపోతే నిరసన కార్యక్రమాలు.. బీఆర్ఎస్ నేత కేటీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని.. మైనార్టీ డిక్లరేషన్ అమల్లోకి తేవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హామీలన్నింటినీ వెంటనే అమలు చేయాలని.. మైనార్టీ డిక్లరేషన్ అమల్లోకి తేవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మతాలకతీతంగా అన్ని పండుగలకు కానుకలు అందించిందని చెప్పారు.
గంగా-జమునా తహజీబ్ సంస్కృతిని కొనసాగిస్తూ, సమాజంలో శాంతిని పెంపొందించే సంస్కృతిని నెలకొల్పామని తెలిపారు. మైనార్టీ బాలబాలికలకు అత్యుత్తమ విద్య కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశామని, ప్రత్యేక విదేశీ విద్యా పథకాన్ని అమలు చేశామని వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ మంగళం పాడుతున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ మైనార్టీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలన్నింటినీ, పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే మైనార్టీలకు హామీల అమలు కోసం కేసీఆర్ అనుమతి మేరకు భారీ నిరసన కార్యక్రమాన్ని చేపడతామన్నారు.