హద్దుల నిర్ధారణ లేక భూ సమస్యలు..!
వ్యవసాయ హద్దుల నిర్ధారణ కోసం రైతులు తిప్పలు పడుతున్నారు.

దిశ, రంగారెడ్డి బ్యూరో: వ్యవసాయ హద్దుల నిర్ధారణ కోసం రైతులు తిప్పలు పడుతున్నారు. సర్వేయర్ భూ సర్వే చేసినా హద్దులు పెట్టేందుకు సామాన్యుడికి నరకం చూపిస్తున్న సందర్భం జిల్లాలో కనిపిస్తున్నది. భూ వివాదాల పరిష్కారం, శిఖం, చెరువు, ప్రభుత్వ, పట్టా భూముల హద్దులు నిర్ణయించడంలో సర్వేయర్ పాత్ర కీలకం. అయితే జిల్లాలో సర్వేయర్ల కొరత వేధిస్తున్నది. భూ వివాదాలు జరిగి పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయిస్తున్నారు. రెవెన్యూ అధికారి కార్యాలయం చుట్టూ భూ సర్వే చేయాలని చక్కర్లు కొడుతున్నారు. జిల్లాలో కొలతల సార్ల కొరత ఏర్పడింది. ఫలితంగా భూ సమస్యల పరిష్కారం కోసం వచ్చే దరఖాస్తుల సంఖ్య పేరుకుపోతుంది. సర్వే ల్యాండ్ రికార్డ్ విభాగంలో పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీలు ఉన్నాయి.
కీలకమైన సర్వేయర్లతో పాటు డిప్యూటీ సర్వేయర్ల కొరత తీవ్రంగా ఉంది. దీంతో సరిహద్దు పంచాయితీలు తెగడం లేదు. భూ వివాదాలు కొలిక్కిరావడం లేదు. భూ సర్వే కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సర్వే కోసం రుసుం చెల్లించి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులిచ్చిన వారి భూముల సర్వేకు మాత్రమే వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో మొత్తం 27 మండలాలుండగా.. జిల్లా కేంద్రం మినహాయించి మండలానికి ఒకరు చొప్పున సర్వేయర్‌ను నియమించాల్సి ఉంది. 27 మండలాలకు 14 మంది సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు ఉన్నారు. ఒక్కో సర్వేయర్‌కు రెండు మండలాలను అప్పగించారు. సర్వేయర్ల కొరత కారణంగా ఐకేపీలో పనిచేస్తున్న ముగ్గురిని సర్వేయర్లుగా విధుల్లోకి తీసుకున్నారు. కందుకూరు, మంచాల, మొయినాబాద్ మండలాల్లో ఐకేపీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను రెవెన్యూశాఖలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మూడు మండలాల్లో సర్వేయర్లుగా పనిచేస్తున్నారు.
నియామకాలు లేవ్..
మండల వ్యవస్థ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కొత్తగా సర్వేయర్లను నియామకం చేపట్టక పోవడంతో సర్వే సమస్య తలెత్తుతున్నది. చైన్‌మెన్లు, సర్వేయర్లు, సీనియర్ సర్వేయర్లు, డిప్యూటీ సర్వేయర్లు, ఇన్ స్పెక్టర్, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఉండాలి. గతంలో ప్రభుత్వ భూములు కొలిచేందుకు ప్రత్యేక సర్వేయర్లు ఉండేవారు. వారు రిటైర్డ్ కావడంతో కొత్తవారిని తీసుకోలేదు.
రంగారెడ్డి జిల్లాలోనే..
మేడ్చల్ జిల్లాలో 15 మండలాలు ఉంటే.. 18 మంది సర్వేయర్లు ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలో కూడా 16 మండలాలకు గాను 19 మంది సర్వేయర్లు ఉన్నారు. కానీ.. రంగారెడ్డి జిల్లాలో మాత్రం 27 మండలాలకు 14 మంది సర్వేయర్లు ఉన్నారు. సర్వేయర్ల కొరత, తలెత్తుతున్న సమస్యలను ముందే గుర్తించి ప్రభుత్వానికి తగిన నివేదిక ఇవ్వాల్సిన జిల్లా స్థాయి అధికారులు ఎందుకు ప్రభుత్వానికి నివేదించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వివాదాలకు కేరాఫ్..
దశాబ్దకాలంగా గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో భూ క్రయ, విక్రయాలు పెరిగిపోయాయి. ధరణి పోర్టరల్ వచ్చిన తర్వాత దస్ర్తాలు, భూ కొలతల్లో చాలా వ్యత్యాసాలు వస్తున్నాయి. కమతాల హద్దుల పక్కనే ఉన్న రైతుల మధ్య వివాదాలు ప్రారంభమై ఘర్షణలకు దారి తీస్తు్న్నది. దీంతో సర్వే చేయాలంటూ రెవెన్యూ, భూ కొలతల శాఖ అధికారులకు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన రుసుం చెల్లించి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు.
కార్యాలయంలో ఖాళీ పోస్టులు దర్శనం..
జిల్లా సర్వే కార్యాలయంలో ఉద్యోగుల కొరత కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. 30 మంది ఉద్యోగులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 18 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మండల స్థాయిలోనే కాకుండా జిల్లా స్థాయిలోని అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. వీరు పూర్తిగా మండల సర్వేయర్లపైనే ఆధారపడుతున్నారు. ఏడీ పరిధిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు ఉండాలి. మండల స్థాయిలో పరిష్కారం కాని వివాదాస్పద భూముల సర్వేకు అధికంగా ఫిర్యాదులు ఏడీ వద్దకు వస్తున్నాయి. ఇన్‌స్పెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి రిపోర్టు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో ఇన్‌స్పెక్టర్లు లేకపోవడంతో వారు చేయాల్సిన పనులు సైతం ఏడీ చూసుకోవాల్సి వస్తుంది.
డబ్బులు ఇచ్చుకో పనిచేసుకో..
భూ సర్వేకు చేతులు తడపనితే పని అవుతుంది. ఎవరైనా నిబంధనలు మాట్లాడితే కొర్రీలు పెడుతున్నారు. ఇప్పుడే మీ భూమి సర్వే చేయలేం.. మీకంటే ముందు చలానాలు చెల్లించిన వారు ఉన్నారు అంటూ బుకాయిస్తున్నారు. సిబ్బంది కొరత, టిఫన్లు అందుబాటులో లేవని తప్పించుకుంటున్నారు. పైరవీకారులు చెబితే ఒకటి, రెండు రోజుల్లో సర్వే పూర్తి చేస్తున్నారు. భూ విస్తీర్ణాన్ని బట్టి ఎంతివ్వాలో చెబుతున్నారు. సర్వే సక్రమంగా పూర్తయితే తుది నివేదిక కోసం మళ్లీ చేయి తడపాల్సిందే. లేదంటే కొర్రీలు పెడుతున్నారు.