రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ఎసరు?
దాదాపు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా దారుల చెర నుంచి రెవెన్యూ అధికారులు కాపాడే ప్రయత్నం చేశారు.

దిశ, ఇబ్రహీంపట్నం: దాదాపు రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా దారుల చెర నుంచి రెవెన్యూ అధికారులు కాపాడే ప్రయత్నం చేశారు. ఇదంతా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ కేంద్రంలోని ఖానాపూర్ గ్రామ పరిధిలో చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 80 లోని 33 ఎకరాల అసైన్డ్ భూమిని 60 మంది పేదలకు ప్రభుత్వం గతంలో ఇచ్చింది. వారు ఆ భూమిని జేబీ వెంచర్, గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకున్నారు. అయితే ఈ భూమిని పక్కనే ఉన్న 67 సర్వే నంబర్ ఆధారంగా ఈ భూమిని రియల్ వ్యాపారులు గ్రామ పంచాయతీ, హెచ్ఎండీఏ వెంచర్లు చేసి ప్లాట్లను అమ్ముకున్నారు. దీనిపై సివిల్ రైట్స్ ప్రొటక్షన్ ఆర్గనైజేషన్ వారు గ్యాప్ ఏరియాలో కన్ స్ట్రక్షన్ జరుగుతున్నాయనే ఫిర్యాదుతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం తహశీల్దార్ సునీత ఆదేశాలతో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పుష్పలత, ప్రభుత్వ సర్వేయర్ సాయికృష్ణారెడ్డి సర్వే నిర్వహించారు.
కాగా, జేబీ రియల్ ఎస్టేట్ సంస్థలో దాదాపు 12 ఎకరాల భూమిని వారు గుర్తించారు. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు ఎకరాలకు పైగా ఆక్రమించారని వారు తేల్చారు. మిగతా భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కలిసి పక్కన ఉన్న సర్వే నెంబర్ 67 ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం గురునానక్ కళాశాలలో, జేబీ వెంచర్, రియల్ వ్యాపారులు చేసిన వెంచర్లలో ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతించారు. పూర్తి స్థాయిలో భూములను స్వాధీనం చేసుకొని కబ్జా దారులపై చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ భూమి విలువ సుమారు రూ. 200 కోట్లకు పైగా ఉంటుంది. అయితే సోమవారం సాయంత్రం గురునానక్ కళాశాల, జేబీ వెంచర్‌లో పాతిన బోర్డులను జేబీ వెంచర్, గురునానక్ కళాశాల యాజమాన్యం తొలగించారు. బోర్డులను తొలగించిన విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ వారు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఫిర్యాదు రావడంతో వెళ్లాం..
ఈ విషయమై ఇబ్రహీంపట్నం తహశీల్దార్ సునీతను వివరణ కోరగా.. గ్యాప్ ఏరియాలో కన్ స్ట్రక్షన్ జరుగుతున్నాయని మాకు ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులకు చెప్పామన్నారు. దీంతో వారి సూచన మేరకు రె వెన్యూ ఇన్ స్పెక్టర్, సర్వేయర్‌ను పం పించి ప్రభుత్వ భూమి అని బోర్డులు పాతించామని, తదుపరి చర్యలు ఉన్నతాధికారుల సూచన మేరకు తీసుకుంటామని తెలిపారు.