మరోసారి బడంగ్ పేట్​ లో పంజా విసిరిన హైడ్రా అధికారులు

మరోసారి బడంగ్​పేట్​లో హైడ్రా అధికారులు పంజా విసిరారు. బడంగ్ పేట్​ లో మూడు రోడ్లు, పార్కును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారుల కూల్చివేతల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Update: 2025-03-27 10:24 GMT
మరోసారి బడంగ్ పేట్​ లో పంజా విసిరిన హైడ్రా అధికారులు
  • whatsapp icon

దిశ, బడంగ్ పేట్​ : మరోసారి బడంగ్​పేట్​లో హైడ్రా అధికారులు పంజా విసిరారు. బడంగ్ పేట్​ లో మూడు రోడ్లు, పార్కును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారుల కూల్చివేతల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మా అగ్రికల్చర్​ ల్యాండ్​ లో మీకేం అధికారాల ఉన్నాయంటూ ? హైడ్రా అధికారులను బీఆర్​ఎస్​ మాజీ కార్పొరేటర్​ బోయపల్లి శేఖర్​రెడ్డి, కాంగ్రెస్​ నాయకులు బోయపల్లి వెంకట్​రెడ్డిలు అడ్డుకున్నారు. మమ్మల్ని చంపకుంటూ ముందుకు పోవాలని జేసీబీ ముందు బైఠాయించారు. హైడ్రా అధికారులు జేసీబీ ముందు నుంచి పక్కకు లాగుతున్న సమయంలో ఒక్కసారిగా హైడ్రా సీఐ తిరుమలేష్​పై బోయపల్లి శేఖర్​రెడ్డి విరుచుకు పడ్డాడు. దీంతో వారి మధ్య పెనుగులాట జరిగింది. హైడ్రా అధికారులను దూషిస్తూ హైడ్రా సీఐ తిరుమలేష్​ను తోసివేయడంతో హైడ్రా సిబ్బంది శేఖర్​రెడ్డి పక్కకు లాక్కెళ్లారు. దీంతో హైడ్రా అధికారులు మూడు 25 ఫీట్ల రోడ్లకు అడ్డుగా వేసిన ఫెన్సింగ్​, క్రికెట్​ నెట్​ గ్రౌండ్​, పార్కు స్థలం లో వెలసిన కట్టడాలను జేసీబీ సహాయంతో కూల్చివేశారు. పార్కు స్థలంలో హైడ్రా అధికారులు ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్​రెడ్డి చిత్రపటానికి, హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

వివరాలలోకి వెళితే...

మహేశ్వరం నియోజక వర్గంలోని బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్పొరేషన్​ పరిధిలోని అల్మాస్​గూడ సర్వే నెంబర్ 39,40,41,42,44లలోని 5 ఎకరాల 07 గుంటల భూమిలో బోయపల్లి పోచిరెడ్డి, బోయపల్లి బాల్​రెడ్డి లు పదేళ్ల క్రితం 1982 జీపీ లే అవుట్​ చేసి ప్లాట్లను విక్రయించారు. అప్పట్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ప్రకటించడంతో పాటు 236 గజాల పార్కు స్థలంతో పాటు బోయపల్లి ఎన్​క్లేవ్​ నుంచి మెయిన్​ రోడ్​ వరకు 25 ఫీట్ల చొప్పున మూడు రోడ్లను లే అవుట్​ లో చూపించారు. కాల క్రమేణా రెండు రోడ్లతో పాటు పార్క్ స్థలాన్ని బోయపల్లి పోచిరెడ్డి, బోయపల్లి బాల్​రెడ్డి వారసులు మాజీ కార్పొరేటర్​ భర్త బోయపల్లి శేఖర్​రెడ్డి, కాంగ్రెస్​ నాయకుడు బోయపల్లి వెంకట్​రెడ్డిలు ఆక్రమించారు. ఆ రోడ్లలో కాలనీవాసులకు దారి ఇవ్వకుండా ఫెన్సింగ్​ వేశారు. మూడు రోడ్లకు గాను రెండు రోడ్లను ఇప్పటికే అక్రమించడంతో పాటు మూడవ రోడ్డును కూడా పూర్తిగా మూసివేయడంతో స్థానికులు స్థానిక కార్పొరేటర్​ సంరెడ్డి వెంకట్​ రెడ్డికి, బడంగ్ పేట్​ మున్సిపల్​ అధికారులకు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలకు ఫిర్యాదు చేశారు.

ఎవరూ స్పందించకపోవడంతో చివరకు కాలనీ వాసులు వారం రోజుల క్రితం హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు ఫిర్యాదు చేశారు. దీంతో బడంగ్ పేట్​ కార్పొరేషన్​ హైడ్రా సీఐ తిరుమలేష్​ పోలీస్​ ప్రొటెక్షన్​ కోసం బుధవారం సాయంత్రమే మీర్​పేట్​ పోలీసులకు లేఖ రాశారు. గురువారం ఉదయం బోయపల్లి ఎన్​క్లేవ్​ ప్రాంతానికి హైడ్రా సీఐ తిరుమలేష్ ఆధ్వర్యంలో 20 మంది హైడ్రా సిబ్బంది తోపాటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 30 మంది సిబ్బంది చేరుకున్నారు. జేసీబీతో రోడ్లకు అడ్డువేసిన ఫెన్సింగ్​ను జేసీబీ సహాయంతో తొలగిస్తుండగా మాజీ కార్పొరేటర్​ భర్త బోయపల్లి శేఖర్​రెడ్డి, కాంగ్రెస్​ నాయకుడు బోయపల్లి వెంకట్​రెడ్డి తదితరులు అడ్డగించారు. జేసీబీ ముందు బైఠాయించడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. హైడ్రా అధికారులు , బోయపల్లి శేఖర్​రెడ్డిల మధ్య తోపులాట జరిగింది.

ఒక దశలో హైడ్రా అధికారుల విధులను అడ్డుకోవడమే కాకుండా హైడ్రా సీఐ తిరుమలేష్​ను దూషిస్తూ తోసివేశాడు. వెంటనే పక్కన ఉన్న హైడ్రా సిబ్బంది శేఖర్​రెడ్డి పక్కకు లాక్కెళ్లారు. అనంతరం బ్లాక్​ చేసిన మూడు రోడ్లతో పాటు కబ్జాకు గురైన పార్కు స్థలాన్ని హైడ్రా అధికారులు కాపాడారు. పార్కు స్థలంలో ప్రభుత్వ సూచిక బోర్డును ఏర్పాటు చేశారు. హైడ్రా అధికారుల విధులను అడ్డుకున్న బోయపల్లి శేఖర్​రెడ్డి పై ఫిర్యాదు చేస్తానన్నారు. అంతేగాకుండా పోలీస్​ ​ ప్రొటెక్షన్​ కల్పించమని చెప్పినా ఘటనా స్థలికి చేరుకోని మీర్​పేట్​ పోలీసులపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కాగా మాజీ కార్పొరేటర్​ భర్త మాత్రం ఇది మా అగ్రికల్చర్​ ల్యాండ్​లో హైడ్రా అధికారులు ఎలా వస్తారని ప్రశ్నించారు. ఏం అధికారాలతో కూల్చివేశారని, రోడ్లు నెమ్మదిగా ఇస్తామనుకున్నామని బోయపల్లి మీడియాకు వివరించారు.

ముందే హెచ్చరించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి....

బోయపల్లి ఎన్ క్లేవ్ లోని లేఅవుట్ లో చూపెట్టిన ప్రకారం మూడు రోడ్లు బ్లాక్​ చేయడమే కాకుండా 236 గజాలలో ఉన్న పార్క్ స్థలాన్ని కబ్జా చేశారంటూ స్థానికులు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో స్పందించిన ఎమ్మెల్యే సబితా స్థానికుల ముందే వివాదం హైడ్రా వరకు వెళ్ళక ముందే సదరు వ్యక్తికి ఫెన్సింగ్ ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని బడంగ్ పేట్ కార్పొరేషన్ డివిజన్ కార్పొరేటర్ సంరెడ్డి వెంకట్ రెడ్డి కి ఫోన్ చేసి మరీ చెప్పారు. దీంతో తోటి సహచర మాజీ కార్పొరేటర్ కావడం కారణంగానే స్థానిక కార్పొరేటర్ అప్పట్లో పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ప్రొటెక్షన్ కావాలని హైడ్రా ముందే చెప్పిన రాని మీర్ పేట్ పోలీసులు....

బోయపల్లి ఎన్ క్లేవ్ లో దాదాపు 5 ఎకరాల స్థలంలో వదిలిన మూడు రోడ్లతో పాటు పార్క్ స్థలం కబ్జా చేశారాని స్థానికులు హైడ్రా కు ఫిర్యాదు చేశారు. గురువారం హైడ్రా ఆధ్వర్యంలో బోయ పల్లి ఎన్ క్లేవ్ లో అక్రమంగా వేసిన ఫెన్సింగ్ లు తొలగించనున్నట్లు అందుకు గాను పోలీస్ ప్రొటెక్షన్ కావాలని మీర్ పేట్ పోలీసులకు బుధవారం సాయంత్రమే లేఖ రాసినప్పటికీ ఘటనా స్థలికి మీర్​ పేట్​ పోలీసులు రాకపోవడం పట్ల కాలనీ వాసులు మండిపడుతున్నారు.

సీఎం, హైడ్రా కమిషనర్​కు పాలాభిషేకం ....

వెంటనే స్పందించి కాలనీ సమస్యను యుద్ద ప్రాతిపదికన పరిష్కరించిన హైడ్రా అధికారులకు బోయపల్లి ఎన్​క్లేవ్​ వాసులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి, హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.

Similar News