మేడారంలో అడుగ‌డుగునా వ్యాపారుల‌ దోపిడీ.. పట్టించుకోని అధికారులు

మేడారంలో భ‌క్తులు నిలువు దోపిడీకి గుర‌వుతున్నారు. అమ్మవార్లకు చెల్లించే మొక్కుల సామగ్రి మొద‌లు అనంత‌రం జ‌రిగే విందుల‌కు సంబంధించిన ప్రతీ వ‌స్తువుపై దాదాపుగా డ‌బుల్ రేట్లు వ‌సూలు చేస్తున్నారు.

Update: 2024-11-25 02:29 GMT

దిశ‌ ప్రతినిధి,ములుగు: మేడారంలో భ‌క్తులు నిలువు దోపిడీకి గుర‌వుతున్నారు. అమ్మవార్లకు చెల్లించే మొక్కుల సామగ్రి మొద‌లు అనంత‌రం జ‌రిగే విందుల‌కు సంబంధించిన ప్రతీ వ‌స్తువుపై దాదాపుగా డ‌బుల్ రేట్లు వ‌సూలు చేస్తున్నారు. మంచినీళ్ల నుంచి మద్యం దాకా, అగ్గిపెట్టె నుంచి వంట నూనె వరకు ఎమ్మార్పీ రేట్లకు అదనంగా పెంచేసి వీధి వ్యాపారులు భక్తులను దోచుకుంటున్నారు. చికెన్ షాప్‌ల్లో అధిక ధరలకు విక్రయించడంతో భక్తులపై భారం పడుతుంది.

అక్కడ అంతా సిండికేట్..

మేడారంలోని వనదేవతల సన్నిధికి వచ్చే భక్తులను లక్ష్యంగా చేసుకొని వీధి వ్యాపారులు అధిక రేట్లతో మోసం చేస్తున్నారు. అక్కడ వందల సంఖ్యలో ఉన్న వీధి వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి ధరలు అమాంతం పెంచి అమ్మడం గమనార్హం. మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చిన భక్తులు మేడారంలోనే వంటలు చేసుకొని భోజనం చేయడానికి మక్కువ చూపిస్తారు. వంట సామగ్రికి ధరలు చుక్కలనంటుతున్నాయి. బహిరంగ మార్కెట్లో 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ ధర రూ.10 కాగా మేడారంలో రూ.40, బెల్లం, కొబ్బరికాయల బహిరంగ మార్కెట్ కంటే రూ.30 నుంచి రూ.60 వరకు అధిక రేట్లు వసూలు చేస్తున్నారు.

వైన్స్ అక్కడ చాలా కాస్లీ..

మేడారంలో మద్యం చాలా కాస్లీ.. బెల్ట్ షాప్ లో మద్యం కొనేవారికి అక్కడి రేట్లు చూసి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. బ్రాండ్లను బట్టి ఫుల్​బాటిల్​కు రూ.120 వరకు అదనంగా, ప్రముఖ కంపెనీకి చెందిన బీర్లు ఎమ్మార్పీ రూ.160 నుంచి రూ. 240 పెంచి అమ్ముతున్నారు. వైన్స్ యజమానులు బెల్ట్ షాపులకు తరలిస్తూ భక్తుల నుంచి అదనంగా దోచుకుంటున్నారు.

పౌల్ట్రీకి ప్రైవేటు వ్యక్తుల టెండర్..

పౌల్ట్రీ సంబంధిత బాయిలర్ కోళ్లు సప్లయ్​చేయటానికి ప్రైవేటు వ్యక్తులు టెండర్లు ఏర్పాటు చేసి పౌల్ట్రీ వ్యాపారుల వద్ద నుంచి టెండర్ సొమ్మును తీసుకొని జాతర ఏరియాను అప్పగిస్తున్నారని, ప్రైవేటు వ్యక్తులు టెండర్ నిర్వహించి లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తులు పేపర్ రేటు కంటే రూ.100 నుంచి రూ. 150 వరకు పెంచి భక్తులపై ధరభారం మోపుతున్నారు. ఆలయానికి సంబంధం లేని ప్రైవేటు వ్యక్తులు పౌల్ట్రీ టెండర్లు నిర్వహించడం ఏంటని భక్తులు ప్రశ్నిస్తున్నారు.

కనిపించని తనిఖీలు..

నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే మేడారంలో వీధి వ్యాపారులు ఇంతలా రేట్లు పెంచుతూ భక్తులను దోపిడీ చేస్తున్న అధికారులు తమకేమీ తెలియదన్నట్లు వ్యవహరిస్తున్నారు. తూనికలు కొలతలు శాఖ, ఎక్సైజ్ శాఖ అటు దేవాదాయ శాఖ, గ్రామ పంచాయతీ ధరలను నియంత్రించటంలో విఫలమయ్యారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News