అన్ని అర్హతలున్నా డబ్బులివ్వాల్సిందే.. నిరాకరిస్తే వారాల తరబడి ముప్పుతిప్పలు

రాష్ట్రంలో వివిధ ధ్రువపత్రాల జారీకి రెవెన్యూ అధికారులు ‘రేటు’ కడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తులను పెట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Update: 2024-11-25 02:23 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో వివిధ ధ్రువపత్రాల జారీకి రెవెన్యూ అధికారులు ‘రేటు’ కడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తులను పెట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అన్ని అర్హతలున్నా డబ్బులివ్వనిదే ధ్రువపత్రం జారీ చేయడం లేదని బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో అనర్హులకూ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

కాసులివ్వకుంటే ముప్పుతిప్పలే

సంక్షేమ పథకాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలకు తహశీల్దార్ కార్యాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు ఎంతో కీలకం. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఏ సర్టిఫికెట్‌కు ఎన్ని రోజుల్లో విచారణ పూర్తి చేసి నిర్ణయం తీసుకోవాలో రశీదు మీదే ఉంటుంది. కానీ అలాంటి కాల వ్యవధిని ఎక్కడా పాటిస్తున్న దాఖలాలు లేవు. అన్నీ ఆధార పత్రాలతో దరఖాస్తు చేసుకున్నా ఉద్దేశ్యపూర్వకంగానే అర్జీదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. డబ్బులు ముట్టజెప్పకుంటే కార్యాలయాల్లో అందుబాటులో ఉండకుండా, విచారణ పేరుతో ఆలస్యం చేస్తూ, క్షేత్రస్థాయి పరిశీలనకు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. సర్వేలు, ఇతర ప్రొటోకాల్ డ్యూటీలు, సెలవులు, టోకెన్ లాప్స్ వంటి కుంటి సాకులతో చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నారని పేర్కొంటున్నారు. మరోవైపు పైసలిస్తే ఎలాంటి పరిశీలన లేకుండా ధ్రువపత్రాలపై డిజిటల్ సంతకాలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీలో ఈ తతంగం ఎక్కువగా నడుస్తున్నది.

ప్రధాన సర్టిఫికెట్లకూ కష్టం

వివిధ రకాల స్కీమ్స్, విద్యాసంస్థల్లో ప్రవేశం, ఉద్యోగాల కోసం దరఖాస్తులకు ఇన్కమ్, క్యాస్ట్, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్, ఈ డబ్ల్యూఎస్, ఫ్యామిలీ మెంబర్, జనన, మరణాల లేట్ రిజిస్ట్రేషన్, నిరుద్యోగ, వ్యవసాయ ఆదాయ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. అయితే వీటి జారీకి ‘ప్రొటోకాల్’ పేరుతో ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ అయితే గిర్దావర్లకు కాసులు కురిపించే ధ్రువపత్రంగా మారిందనే ప్రచారం ఉంది. అడ్మిషన్లు, ఉద్యోగాల కోసం వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉండి, రేషన్ కార్డు లేదా నివాసం నిర్ధారించే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. తహశీల్దారే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినందున ఇవే వివరాలను రూ.20 స్టాంప్ పేపరుపై అఫిడవిట్/సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే చాలు. కానీ నిబంధనలపై విషయ పరిజ్ఞానం పెంచుకోని కొందరు గిర్దావర్లు.. నోటరీ, అఫిడవిట్/సెల్ఫ్ డిక్లరేషన్ మధ్య బేధం తెలియకుండా అభ్యర్థులను ముప్పు తిప్పలు పెడుతున్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఉద్యోగాల్లో ప్రవేశానికి మాత్రమే రూ.8 లక్షల వార్షికాదాయం, ఐదెకరాల్లోపు పట్టా భూమి, 1,000 చదరపు అడుగుల నివాసం లేదా మున్సిపాలిటీల్లో 100 చ.గజాల ఇల్లు లేదా నాన్-నోటిఫైడ్ మున్సిపాలిటీల్లో 200 చ. గజాల్లో ఇల్లు వంటివి ఏవీ లేని వారు ఆటోమేటిగ్గా ఈడబ్ల్యూఎస్ కు అర్హులు అవుతారు. వార్షికాదాయం నిర్ధారించాల్సిన గిర్దావర్లే కొన్నిసార్లు రేషన్ కార్డు ఉన్నా కూడా ఆదాయ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. వరంగల్ జిల్లా కేంద్రం పక్కనున్న ఓ మండలంలో తండ్రి వెన్నునొప్పితో ఇంటికే పరిమితం కాగా, తల్లి కుట్టుమిషన్ ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్నారు. వారి కూతురు అన్ని అర్హతలుండీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కోసం గతేడాది దరఖాస్తు చేసుకుంటే నిబంధనల పేరుతో ముప్పుతిప్పలు పెట్టారు. గిర్దావర్ కు రూ.3,000 ఇచ్చే వరకు పని కాలేదు. మళ్లీ ఈ ఏడాది కూడా అలాగే తిప్పుతుండడంతో ప్రతీసారి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఇవ్వాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విచారణ పేరిట..

గ్రూప్-1, ఆపై స్థాయి ఉద్యోగంలోకి నేరుగా ఎంపికైనా లేదా వార్షికాదాయం రూ.8 లక్షలు మించిన అభ్యర్థి మినహా ఇతర ఓబీసీలు అందరూ నాన్-క్రిమిలేయర్ సర్టిఫికెట్ కు అర్హులే. కానీ వీటి జారికీ ముప్పు తిప్పలు పెడుతున్నారు. వ్యవసాయ ఆదాయ సర్టిఫికెట్ కోసమూ ఇబ్బంది పెడుతున్నారు. సర్టిఫికెట్ విచారణ నివేదిక ఆర్డీవో కార్యాలయానికి ఫార్వర్డ్ చేయడానికీ ఇదే తంతు. కుటుంబ లావాదేవీలు, బీమాలు, బ్యాంక్ వ్యవహారాలు, ఆస్తుల రిజిస్ట్రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలకు అర్జీ చేసుకోవడానికి అవసరమయ్యే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ కోసం వరంగల్ వంటి నగరంలో మధ్యవర్తులు రూ.20 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఇటీవల వరంగల్ తహశీల్దార్ కార్యాలయంలో తప్పుడు ష్యూరిటీలు పెట్టి కొందరు అనధికార సిబ్బంది దొంగ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైగా అర్హులకు కూడా సర్టిఫికెట్ల జారీ నిలిపేసి, కలెక్టర్ నుంచి అనుమతి తెచ్చుకోవాలని కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారు. హైదరాబాద్ లాంటి మహానగరంలో అభ్యర్థులు ఎవరో విచారించే ఓపిక లేక.. ప్రతీ తహశీల్దార్ కార్యాలయంలో నేరుగా పైసలతోనే పనులు చేస్తున్నారు. ఇటీవల ఖైరతాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో ఒక ఎక్స్-సర్వీస్ మ్యాన్ నుంచి రూ.3,000 తీసుకొని మరీ ఇన్కం సర్టిఫికెట్ జారీ చేశారని, అదేమంటే అభ్యర్థి ఎవరో మాకేం తెలుసని దబాయించారని ఒకరు వాపోయారు. కొన్నిచోట్ల కార్యాలయాల్లో కొత్తగా వచ్చిన జూనియర్ అసిస్టెంట్లే స్పెషల్ గిర్దావర్ల అవతారమెత్తి ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

కుటుంబసభ్యుల ధ్రువపత్రం కోసం..

ఓ పీహెచ్డీ డాక్టరేట్ అసోసియేట్ రీసెర్చర్, తెలంగాణ ఉద్యమకారుడైన వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. మూడు నెలలు తిప్పించుకొని రూ.6 వేలు ఇస్తే గానీ పని చేయలేదు. అదే పనికి ఒక మధ్యవర్తి రూ 20 వేలు అడిగారు. ఇక తహశీల్దార్లు ప్రతి ఒక్కరి జీతం రూ.లక్ష ఉంటుంది. ఇంకా వెహికల్ అలవెన్స్ వస్తుంది. ఎలాగో ల్యాండ్ గ్రీవెన్స్ వేలాదిగా వసూలు చేస్తారు. ఇటీవల వరంగల్ జిల్లాలోని ఓ తహశీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబ సభ్యుల ధ్రువపత్రం కోసం దరఖాస్తుదారుడి నుంచి రూ.1500 అడిగినట్లు ఓ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. బాధితుడి తండ్రి మరణించాడు. తన తండ్రి పేరిట ఉన్న 0.25 గుంటల భూమిని తన పేరిట మార్చుకోవాలని అధికారులను సంప్రదించగా.. కుటుంబ ధ్రువపత్రం కావాలన్నారు. సదరు వ్యక్తి రెండు నెలల క్రితం మీ సేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. రోజులు గడుస్తున్నా అధికారులు క్షేత్రస్థాయి విచారణకు రాకపోవడంతో అదే గ్రామానికి చెందిన తన బంధువుకు విషయం చెప్పాడు. అతడు రెవెన్యూ అధికారితో సెల్ ఫోన్‌లో మాట్లాడి పని కావాలని, ఏమైనా ఉంటే చూసుకుంటామన్నారు. తనకు రూ.1500 ఇస్తే సరిపోతుందని అధికారి చెప్పిన ఆడియో వైరల్ అయ్యింది.

ఊరికొక్కరు లేకనే..

2020లో వీఆర్వో వ్యవస్థ రద్దు, 2022లో వీఆర్ఏ వ్యవస్థ రద్దుతో రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ రెవెన్యూ సేవలు పూర్తిగా గాడితప్పాయి. అదేమంటే గతంలో ప్రతీ మండలంలో 10-15 మంది వీఆర్వోలు, 30-50 మంది వరకు వీఆర్ఏలు కలిసి చేసిన పని ఇప్పుడు మండలానికొక్క గిర్దావర్ మాత్రమే చేయాల్సి వస్తున్నదని, అన్నీ పరిశీలించడం తమ వల్ల కావడం లేదని, తీవ్ర పని ఒత్తిడి ఉందని వారు తప్పించుకుంటున్నారు. ప్రతీ గ్రామానికి ఒక మధ్యవర్తిని నియమించుకొని ఇష్టారాజ్యంగా వసూలు చేస్తూ.. సిబ్బంది కొరత, ప్రొటోకాల్ ఖర్చుల పేరుతో సామాన్యులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. గతంలో బీసీబంధు సందర్భంగా అర్జీదారులు రోజుల తరబడి తహశీల్దార్ కార్యాలయ వద్ద రాత్రుళ్లు కూడా జాగరణలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

Tags:    

Similar News