‘అమ్మో.. ఇసుకాసురులు’.. పొలాలకు వెళ్లాలంటేనే జంకుతున్న రైతులు
కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అక్రమ ఇసుక దందా పై నిఘా పెంచి కట్టడి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. మాఫియా మాత్రం అడ్డుకునేది ఎవరంటూ రెచ్చిపోతున్నారు.
దిశ బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. అక్రమ ఇసుక దందా పై నిఘా పెంచి కట్టడి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. మాఫియా మాత్రం అడ్డుకునేది ఎవరంటూ రెచ్చిపోతున్నారు. అక్రమంగా తరలిస్తున్న ఇసుక వ్యాపారులపై ప్రత్యేక దృష్టి సారించిన అధికార బలంతో సంబంధిత అధికారులను శాసిస్తున్నారు. ఇసుక రవాణా సాఫీగా సాగేందుకు ప్రభుత్వ భూములలో చెరువు మత్తడిలు సాగునీటి కాలువలను పూడ్చేసి రహదారులుగా మార్చుతూ ఇసుక రవాణా సాగిస్తున్నారు. స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసినా కళ్ల ముందే అక్రమ ఇసుక దందా సాగిన పట్టించుకునేవారు లేకపోవడంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. అనుభవం లేని మైనర్ డ్రైవర్లతో అతివేగంగా ట్రాక్టర్లను నడిపిస్తూ పల్లెల్లో ప్రమాదాలకు కారణమవుతున్నారు. నిత్యం ఇసుక ట్రాక్టర్ల రవాణాతో పొలాలకు వెళ్లే దారులు ధ్వంసమై ప్రమాదకరంగా మారుతున్నాయి. ఆ రోడ్లపై రైతులు నడవలేని దుస్థితి ఏర్పడటంతో వ్యవసాయ భూములకు వెళ్లేందుకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రాత్రిపూట కరెంటు మోటర్ల దగ్గరకు వెళ్లాలంటే ఏ ట్రాక్టర్ వచ్చి ఢీ కొట్టి ప్రాణాలు పోతాయోననే భయంతో రైతులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పోలాలకు వెళ్తున్నారు.
కట్టు కాలువ కబ్జా చేసి మత్తడి పూడ్చి ఇసుక రవాణాకు దారి..
జిల్లాలో ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోంది. రోజుకు వందల ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు మాత్రం అక్రమార్కులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారు. కరీంనగర్ రూరల్ మండలం ఎల బోతారం లో ఇసుక మాఫియా కట్టు కాలువను కబ్జా చేసి చెరువు మత్తడిని మట్టితో నింపి అక్రమ ఇసుక రవాణా సాగిస్తున్నారు. దీంతో చెరువు నిండి చెరువు తెగిపోయే ప్రమాదం ఏర్పడగా మత్తడి కట్టు కాలువ ద్వారా నీరు ప్రవహించి పొలాలకు నీరు అందేది కట్టు కాలువ కబ్జా చేసి మట్టితో పూడ్చడంతో చెరువు కింది పొలాలకు నీరు చేరడం లేదని రైతులు ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పోలీసులకు సమాచారం అందించినప్పటికీ అక్రమ ఇసుక రవాణాను అరికట్ట కపోవడంతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా ఇసుక రవాణా సాగిస్తున్నారు. దీంతో అధికారులు ఇసుక మాఫియా ఇచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటి కైనా అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని కోరుకుంటున్నారు.
మైనర్లే డ్రైవర్లు.. అతివేగంతో ప్రమాదాలు
ఇసుక మాఫియా ఇసుకను తరలించేందుకు మైనర్ డ్రైవర్లను ట్రాక్టర్ డ్రైవర్లుగా నియమించడంతో వారు మితిమీరిన వేగంతో ట్రాక్టర్లను నడిపిస్తూ నిత్యం ప్రమాదాలకు కారకులవుతూ అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు. ఇసుక ట్రాక్టర్లు ఇష్టానుసారంగా పరిమితికి మించి లోడ్ చేసి పొలాలకు వెళ్లే దారులపై తరలించడంతో రోడ్లు ధ్వంసం అయి రైతులు ఆ రోడ్ల పై ప్రయాణం చేయాలంటే ప్రమాదకరంగా మారిపోయాయి. అర్ధరాత్రులు ఇసుక ట్రాక్టర్లు నడవడంతో రైతులు కరెంటు వేసేందుకు పోలాలకు వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు.
మానేరులో పట్టపగలే ఇసుక అక్రమ రవాణా మానేరు తీగల వంతెన దగ్గర రీవర్ ఫ్రంట్ నిర్మాణం చేపడుతున్న మానేరులో ఇసుక మాఫియా పట్టపగలు జేసీబీలు పెట్టి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నారు. రోజు వందల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అభివృద్ధి పనులకు ఇసుకను తరలిస్తున్నారంటూ మస్కా కొడుతూ యథేచ్ఛగా అక్రమ ఇసుక దందాను సాగిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకునేవారు లేకపోవడంతో నగరం కొంతమంది ముఠాగా ఏర్పడి అను నిత్యం రోడ్డు పై టీం గా పర్యవేక్షిస్తూ ఎవరికీ చిక్కకుండా ఇసుకను తరలిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అరికట్టి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.