పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల..

Update: 2023-07-19 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు నిర్వహించే పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి వెల్లడించారు. మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో నిర్వహించిన సమావేశంలో ఆయన దీనికి సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఈనెల 28వ తేదీన నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈనెల 31వ తేదీ నుంచి ఆగస్టు 18వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రక్రియ ఉంటుందని స్పష్టంచేశారు. వచ్చే నెల 7 నుంచి 9వ తేదీ వరకు ఫిజికల్‌ వెరిఫికేషన్‌ ఉంటుందన్నారు. ఆగస్టు 21 నుంచి 23 వరకు ఫస్ట్ ఫేజ్ వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. 24వ తేదీన వెబ్‌ ఆప్షన్లలో ఎడిట్‌కు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆగస్టు 26వ తేదీన ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామన్నారు.

ఆగస్టు 28 నుంచి 30 వరకు సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు ట్యూషన్ ఫీజు చెల్లించిన రశీదుతో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్‌ 4 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందని, సెప్టెంబర్‌ 4 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ఉంటుందని తెలిపారు. సెప్టెంబర్‌ 11 నుంచి 12 వరకు ఫేజ్‌ వెబ్‌ ఆప్షన్లు, సెప్టెంబర్‌ 13న వెబ్‌ ఆప్షన్లలో ఎడిట్‌ చేసుకోవచ్చని చెప్పారు. సెప్టెంబర్‌ 16న రెండోదశలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని, సెప్టెంబర్‌ 19 నుంచి 23 వరకు కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాలని, సెప్టెంబర్‌ 19 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని లింబాద్రి వివరించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్‌పర్సన్లు వెంకట రమణ, ఎస్‌కే మహమూద్‌, సెక్రెటరీ ఎన్‌ శ్రీనివాస్‌ రావు, టీఎస్‌ పీజీఈసెట్‌ కన్వీనర్‌, ప్రొఫెసర్‌ పీ రమేశ్‌బాబు హాజరయ్యారు. ఇతర వివరాలకు http:pgecetadm.tsche.ac.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.


Similar News