KTR BRSParty : ఇకపై ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదు.. మాజీమంత్రి కేటీఆర్ ఫైర్

అడ్డు అదుపు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.

Update: 2024-10-22 06:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: అడ్డు అదుపు లేకుండా తనపై ఆరోపణలు చేస్తున్నారని, రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. తనపై చేస్తున్న వ్యక్తిగత విమర్శలకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రత్యర్థులపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్.. నా క్యారెక్టర్ పై నిరాధార ఆరోపణలు, పిరికిపందల్లాగా చేస్తున్న వ్యక్తిగత దాడులకు వ్యతిరేకంగా నేను దృఢమైన వైఖరిని తీసుకున్నానని స్పష్టం చేశారు. మంత్రి కొండా సురేఖ తన దురుద్దేశపూరితమైన, చౌకబారు వ్యాఖ్యలకు ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసినట్లు తెలిపారు.

చాలా కాలంగా ఈ దాడులు, గుసగుసల ప్రచారాల ద్వారా క్యారెక్టర్ ను చులకన చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో ఈ దాడులలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ఇకపై అలా జరగదని తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధిగా తాను ఎల్లప్పుడూ వ్యక్తిగత వివాదాల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని అన్నారు. కానీ ఇక నుంచి వీటిని అడ్డుకునేందుకు సమయం ఆసన్నమైందని తెలిపారు. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు వాక్‌చాతుర్యాన్ని ప్రచారం చేయవచ్చని భావించే వారికి ఈ వ్యాజ్యం ఒక గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నానని అన్నారు. ఇక కోర్టులో నిజం గెలుస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కాగా కేటీఆర్, మంత్రి కొండా సురేఖ పై వేసిన పరువు నష్టం దావా కేసు రేపు విచారణకు రానున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


Similar News