రూ.10 కాయిన్ చెల్లుతుందా..? లేదా..? కీలక ప్రకటన చేసిన ఇండియన్ బ్యాంక్
రూ.10 కాయిన్ చెలామణీపై ఎప్పుడూ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. కొన్ని చోట్ల ఈ కాయిన్ చెల్లితే.. ఇంకొన్ని చోట్ల ఈ కాయిన్‌ని చూడగానే.. అది చెల్లదంటూ వెనక్కిచ్చేస్తారు.
దిశ, వెబ్‌డెస్క్: రూ.10 కాయిన్ చెలామణీపై ఎప్పుడూ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంటుంది. కొన్ని చోట్ల ఈ కాయిన్ చెల్లితే.. ఇంకొన్ని చోట్ల ఈ కాయిన్‌ని చూడగానే.. అది చెల్లదంటూ వెనక్కిచ్చేస్తారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 కాయిన్ చూస్తే చాలు ఏదో భూతాన్ని చూసినట్లు చూస్తారు. దీంతో ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఆర్బీఐ కూడా ఎవరైనా రూ.10 కాయిన్ తీసుకోవడానికి నిరాకరిస్తే నేరంగా పరిగణించాలంటూ సంచలన ప్రకటన చేసింది. అయినా దీనిపై అపోహలు మాత్రం ఇంకా తొలగిపోలేదు. ఇప్పటికీ అనేక చోట్ల ఈ కాయిన్ తీసుకోవడానికి వెనకాడుతూనే ఉన్నారు.
ఈ సందర్భంలోనే రూ.10 కాయిన్ కాంట్రవర్సీపై తాజాగా ఇండియన్ బ్యాంక్ ప్రత్యేకంగా అవగాహనా కార్యక్రమం నిర్వహించింది. హైదరాబాద్ హిమాయత్ నగర్ బ్రాంచ్ వద్ద జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. రూ.10 కాయిన్స్ చట్టబద్ధమైనవని, వీటిపై ఎలంటి నిషేధం లేదని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో కూడా ఈ నాణేలు చెల్లుబాటు అవుతున్నాయని తెలిపారు. అనంతరం ఖాతాదారులకు రూ.10 నాణేలను అందించారు.
ఇదిలా ఉంటే మార్కెట్లో రూ. 10 నోట్ల కొరత కూడా ఏర్పడడం వల్ల ఆ కొరతను కాయిన్స్ వినియోగంతో తగ్గించాలనే ఉద్దేశంతోనే బ్యాంకులు ఈ డ్రైవ్‌లను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.