ఎవరి సొమ్ముతో వారిని కొరియాకు పంపారు : ఎమ్మెల్సీ మల్లన్న కీలక వ్యాఖ్యలు

పలువురు జర్నలిస్టులను దక్షిణ కొరియా పర్యటనకు పంపడంపై అధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-10-22 06:37 GMT

దిశ, వెబ్ డెస్క్ : పలువురు జర్నలిస్టులను దక్షిణ కొరియా పర్యటనకు పంపడంపై అధికార పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరి సొమ్ముతో వారిని కొరియాకు పంపారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వాళ్ళంతా సియోల్ లో పర్యటించి ఏం చేస్తారని, ఇదంతా ప్రజల సొమ్మును వృథా చేయడమేనంటూ మల్లన్న మండిపడ్డారు. కొరియా ప్రభుత్వాన్ని అడిగితే వారే ఓ వీడియో తీసి పంపేవారన్నారు. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు అమలులో భాగంగా సియోల్ లోని చంగ్ ఏ చంగ్ నది సుందరీకరణ జరిగిన తీరును అధ్యయనం చేసేందుకు మంత్రులు, అధికారులు, జర్నలిస్టులతో కూడిన బృందాన్ని కొరియా పర్యటనకు పంపించింది. ఈ బృందంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సహా అధికారులు, పలువురు జర్నలిస్టులు ఉన్నారు. వారంతా ప్రస్తుతం సియోల్ పర్యటనలో ఉన్నారు.

కాగా చంగ్ ఏ చంగ్ నది అధ్యయనం కోసం కొరియాకు ప్రభుత్వం ప్రత్యేకంగా బృందాన్ని పంపించడాన్ని స్వతహాగా జర్నలిస్టు కూడా అయిన.. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్న తీన్మార్ మల్లన్న తప్పుబట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అటు ఇదే అంశంపై బీఆరెఎస్ కూడా ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కాంగ్రెస్ మద్దతుతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైనప్పటికిని మల్లన్న తరుచూ ప్రభుత్వ విధానాలపై విమర్శలు సంధిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపైన, జీవో 29, బీసీ రిజర్వేషన్లు వంటి పలు అంశాలపై మల్లన్న ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించారు. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉండి మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తుండటం వెనుక కారణలేమిటన్నది చర్చనీయాంశమైంది.   


Similar News