PCC chief: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు: పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

జగిత్యాలలో గంగారెడ్డి హత్యపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ స్పందించారు.

Update: 2024-10-22 08:06 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదని ఎవరు ఎవరిని హత్య చేసినా అది మంచిది కాదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. జగిత్యాల జిల్లా జాబితాపూర్ లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరుడు గంగారెడ్డి హత్యపై ఆయన స్పందించారు. ఈ దారుణాన్ని మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. మంగళవారం నిజామాబాద్ జిల్లాలో మాట్లాడిన ఆయన.. హత్యలు, దాడులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని, గంగారెడ్డి హత్యపై పోలీసులతో మాట్లాడుతానన్నారు. దోషులను తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేశారు.

తప్పుకు కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్ విమర్శలు:

తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆదాయం తగ్గింతంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ పై స్పందించిన ఆయన.. ఏ అంశాల్లో రాష్ట్ర ఆదాయం తగ్గిపోయిందో చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఇష్టారాజ్యంగా అప్పులు తీసుకువచ్చి ప్రజల నెత్తిపై మోపారని ధ్వజమెత్తారు. అవసరం లేని చోట్లా భారీ బడ్జెట్లు పెట్టి కమీషన్ల రూపంలో దండుకుని కేసీఆర్ కుటుంబం బాగుపడింది తప్ప తెలంగాణలోని ప్రజలకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులకు పశ్చాత్తాప పడకుండా కొత్త ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

నియంత మాదిరిగా ఇష్టారీతిగా పాలన సాగించినందునే ప్రజలు బీఆర్ఎస్ ను గద్దె దించి కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాపాలన సాగుతుంటే దీన్నీ ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఇబ్బందుల్లో ఉందంటే అది బీఆర్ఎస్ పదేళ్ల నిర్వాకమే కారణం అన్నారు. హైడ్రా పై విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ ఏం చెప్పదల్చుకుందని ప్రశ్నించారు. దర్జాగా కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల అక్రమ నిర్మాణాలను కూల్చొద్దని చెబుతున్నా అని ప్రశ్నించారు. మా ప్రభుత్వంలో సొంత పార్టీకి చెందిన పల్లంరాజు కట్టడాలను సైతం కూల్చివేశామని గుర్తు చేశారు. మా ప్రభుత్వానికి తన మన బేధాలు లేవన్నారు. హైడ్రా ఉద్దేశం మీకు అర్థం కావడం లేదా అని నిలదీశారు. కబ్జాదారుల అక్రమ నిర్మాణాలను కూలుస్తామంటే మీకు నొప్పేంటని ప్రశ్నించారు.


Similar News