ఇంకాసేపట్లో మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని పౌరసత్వంపై హైకోర్టు తీర్పు

వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై సాగుతున్న కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది.

Update: 2024-10-22 07:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై సాగుతున్న కేసులో నేడు హైకోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. చెన్నమనేని రమేశ్ పౌరసత్వాన్ని రద్దు చేయాలని హైకోర్టులో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గతంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఆరేళ్లుగా హైకోర్టులో ఈ కేసులో వాదనలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బెంచ్ ఈ కేసులో తీర్పు వెల్లడించనుంది. 2009 నుంచి చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వంపై వివాదాలు కొనసాగుతున్నాయి. జర్మనీ పౌరసత్వం కారణంగా 2019లో భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్‌ సైతం జారీ చేసింది. దీనిని చెన్నమనేని కోర్టులో సవాల్ చేశారు.

అనంతరం చెన్నమనేని ర‌మేశ్ 2018 ఎన్నిక‌ల్లో త‌ప్పుడు అఫిడ‌విట్‌ దాఖ‌లు చేశార‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఆది శ్రీ‌నివాస్ తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఆ ఎన్నిక‌ల సంద‌ర్భంగా ర‌మేశ్ జ‌ర్మని పాస్‌పోర్ట్‌ పై ప్రయాణాలు చేశార‌ని, అదేవిధంగా జ‌ర్మనీ పౌర‌స‌త్వం మీద‌నే ఎన్నిక‌ల్లో పోటీ చేశార‌ని, ఇది చ‌ట్టవిరుద్ధం అని కాంగ్రెస్ నేత పిటిష‌న్‌లో పేర్కొన్న విష‌యం తెలిసిందే. దీనిపైన విచార‌ణ చేప‌ట్టిన ధ‌ర్మాస‌నం ర‌మేశ్ విదేశీ ప్రయాణాల వివ‌రాలు అంద‌జేయాల‌ని కేంద్రాన్ని ఆదేశించింది. చెన్నమనేని రమేశ్ విదేశీ ప్రయాణాల‌కు సంబంధించిన పూర్తి వివరాల‌ను అడిషనల్ సొలిసటర్ జనరల్ కోర్టుకు సమర్పించారు. ఇరువురి వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం తీర్పును రిజ‌ర్వు చేసింది.


Similar News