Dharani Portal : ధరణి పోర్టల్‌ నిర్వహణపై సర్కార్ షాకింగ్ నిర్ణయం.. ఎన్‌ఐసీకి అప్పగిస్తూ ఉత్తర్వులు

తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్‌ నిర్వహణకు సంబంధించి ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Update: 2024-10-22 06:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని భూ రికార్డులపై పెత్తనంలో ఎట్టకేలకు టెర్రాసిస్(Terraces) పని ఖతం కానున్నది. డిసెంబరు ఒకటో తేదీ నుంచి ఎన్ఐసీ(National Informatics Centre) బాధ్యతలు చేపడుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ అధికారులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ ప్రతినిధులు, తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ కలిసి ఐఎల్ఎఫ్ఎస్(తర్వాత టెర్నాసిస్) కాంట్రాక్టును రద్దు చేయాలని నిర్ణయించారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి మూడేండ్ల పాటు ఎన్ఐసీకి అప్పగించాలని నిర్ణయించారు.

ఐతే టెర్రాసిస్ నుంచి ఎన్ఐసీకి డేటా, మెయింటెనెన్స్ వర్క్ ట్రాన్ష్ ఫర్ చేసేందుకు ఒక నెల గడువు ఇచ్చారు. ఈ నెల 29 వరకు టెర్రాసిస్ కాలపరిమితిని నవంబరు 30 వరకు పొడిగించారు. ఈ నెల రోజుల పాటు టెర్రాసిస్ సిబ్బంది ఎన్ఐసీలోనే వర్క్ చేస్తారు. ఈ వ్యవధిలోనే పూర్తి స్థాయిలో ధరణి పోర్టల్(Dharani Portal) కార్యకలాపాల నిర్వహణ బాధ్యతలను ఎన్ఐసీ స్వీకరిస్తున్నది. 2018 మార్చి 29న జీవో 65 ద్వారా ఐఎల్ఎఫ్ఎస్ టెక్నాలజీస్ లిమిటెడ్(టెర్రాసిస్) అప్పగించారు. రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఐటీఈసీ, టీజీటీఎస్ వెబ్ సైట్లల్లో బాధ్యతలను చేపట్టారు.

తొలుత 2018 ఏప్రిల్ 20 నుంచి ధరణి పోర్టల్ ని రూపొందించేందుకు అప్పగించారు. ఆ తర్వాత 2020 అక్టోబరు 29 నుంచి 2023 అక్టోబరు 29 వరకు అంటే మూడేండ్ల పాటు కాంట్రాక్టు ఇచ్చారు. ఏ పద్ధతిని అనుసరించాలన్న అంశంపై అనేక వివాదాలు ఉన్నాయి. అలాగే గతేడాది కాలపరిమితి ముగిసినా మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే ఐఎల్ఎఫ్ఎస్ నుంచి టెర్రాసిస్ గా రూపాంతరం చెందింది. అయినా అప్పటి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

కమిటీ నిర్ణయంతోనే..

ఈ నెల 29న టెర్రాసిస్ కాలపరిమితి ముగుస్తుండడంతో ధరణి బాధ్యతలు ఏ కంపెనీకి అప్పగించాలన్న నిర్ణయంపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. ఇందులో ఎన్ఐసీ, సీజీజీ, టీజీ ఆన్‌లైన్ పేర్లు పరిశీలనకు వచ్చాయి. ఆఖరికి ఎన్ఐసీకి అప్పగించాలని తుది నిర్ణయాన్ని ప్రకటించారు. ల్యాండ్ రికార్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో ఎన్ఐసీకి సుదీర్ఘ అనుభవం ఉంది. అందుకే మూడేండ్ల పాటు అప్పగించారు. ట్రాన్సిషన్ పీరియడ్‌ని రెండు నెలలుగా పేర్కొన్నారు. అందులో ఒక నెల టెర్రాసిస్‌కి ఎక్స్‌టెన్షన్ ఇచ్చారు.

25న కీలక సమావేశం

ధరణి ప్రాజెక్టును ఎన్ఐసీకి అప్పగించే అంశంపై ఈ నెల 25న కీలక సమావేశం జరగనున్నది. ఇందులో టీజీటీఎస్, ఎన్ఐసీ, టెర్రాసిస్ టెక్నాలజీ లిమిటెడ్ ప్రతినిధులు పాల్గొననున్నారు.


Similar News