దిశ ప్రతినిధి, నిజామాబాద్: గ్రామాలకు డెవలప్మెంట్ కింద వచ్చే నిధుల విషయంలో జరిగిన చర్చలో సర్పంచ్‌కు ఘోర అవమానం జరిగింది. ఈ సంఘటన శుక్రవారం బోధన్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగింది. గొడవపడి దెబ్బలాడుకున్నది ఇద్దరు అధికార పార్టీ నేతలే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే.. ''గ్రామాలకు నిధులను కేటాయింపులో వివక్షత చూపుతున్నారు. మేజర్ గ్రామ పంచాయతీ అని కనీసం రూ.5 లక్షల నిధులు కూడా ఇవ్వడం లేదు. నిధులన్నీ జెడ్పీటీసీ భర్త, మాజీ ఎంపీపీ, ప్రస్తుత అమ్దాపూర్ సొసైటీ చైర్మన్ గిర్ధావర్ గంగారెడ్డి సొంత గ్రామానికి మళ్లించుకుంటున్నాడు'' అని ఊట్‌పల్లి సర్పంచ్ ఆరోపించారు. దీంతో ఆగ్రహానికి గురైన సొసైటీ చైర్మన్ గంగారెడ్డి సర్పంచ్ కృష్ణను చెంప దెబ్బకొట్టారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నప్పుడే ఈ ఘటన జరగడం విశేషం. ఈ విషయంపై అధికార పార్టీలో రగడ మొదలైంది. గ్రామ ప్రథమ పౌరున్నే కొట్టడంపై ఊట్‌పల్లి గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై నిరసనలకు సిద్దమవుతున్నట్లు తెలిసింది.