సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరగాలి

కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు.

Update: 2024-11-19 13:03 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ నవంబర్ 19: కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్ లో ఓపీఎంఎస్ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. మాక్లూర్ మండలం ఒడ్డాట్ పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో..కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం సందర్శించారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యం ఎంత, రైస్ మిల్లులకు ఎంత పరిమాణంలో ధాన్యం రవాణా చేశారు, బిల్లుల చెల్లింపులు ఏ మేరకు జరిగాయని తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించిన అనంతరం రైస్ మిల్లుల వద్ద ఎక్కడైనా తరుగు, కడ్తా పేరిట కోతలు అమలు చేస్తున్నారా అని రైతులను ఆరా తీశారు. ఇప్పటివరకు అలాంటిదేమీ లేదని, కొనుగోలు కేంద్రాల్లోనూ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని రైతులు తెలిపారు. ఏఈఓ ధ్రువీకరణ పత్రాన్ని జతపరుస్తూ, ఆన్లైన్ లో సన్న ధాన్యం వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని, సరిపడా గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచుకోవాలాన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా చూడాలని అధికారులకు సూచించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తూ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


Similar News