ఎల్లారెడ్డిలో కోతుల బెడద.. చిన్నారి పై పడి కరిచిన కోతులు..
ఎల్లారెడ్డి పట్టణంలో కోతుల బెడద అధికంగా మొదలయ్యింది.
దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి పట్టణంలో కోతుల బెడద అధికంగా మొదలయ్యింది. పట్టణంలోని పలు వార్డుల్లో కోతులు గుంపులు గుంపులుగా నివాసాలలోకి దూసుకొస్తూ మహిళల పై చిన్నారుల పై దాడులు చేస్తూ కరుస్తున్నాయి. ఎన్నోసార్లు అధికారులకు ప్రజలు మొరాయించుకున్న ఫలితం శూన్యం అవుతుంది. కోతులతో పాటు అధికంగా గుంపులు గుంపులుగా కాలనీలో కుక్కలు కూడా చేరడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మున్సిపల్ పట్టణంతో పాటు పలు గ్రామాల్లో కూడా, కుక్కలు, కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. కుక్కలు చిన్న పిల్లలనే కాదు, పెద్దలనూ వెంటపడి కరుస్తున్నాయి. కోతులు గుంపులు, గుంపులుగా తిరుగుతూ, ఇళ్లల్లోకి చొరబడుతున్నాయి. తిండి కోసం ఇల్లంతా చిందర వందర చేస్తున్నాయి. మహిళలు, పిల్లల పై దాడులు చేస్తున్నాయి.
పెద్దవాళ్లు కర్రలతో బెదిరిస్తున్నా జంకడం లేదు. మందలుగా మనుషుల మీదకు దూకుతున్నాయి. ఇది వరకు బాణాసంచా కాల్చగానే భయపడి పారిపోయేవి. ఇప్పుడు వాటికీ బెదరటం లేదు. ఇళ్ల ముందు పూలకుండీలు, విద్యుత్‌దీపాలు, విలువైన వస్తువులను పగుల గొడుతున్నాయి. కోతుల బాధలు పడలేక తలుపులు వేసుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలోని ఒకటో వార్డు రెండో వార్డు బస్టాండు వైపున కోతులు గుంపులు గుంపులుగా వస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నలుగురైదుగురు కలిసి శబ్ధాలు చేస్తూ, కర్రలతో అదిలిస్తున్నప్పటికీ కోతులు పారిపోవటం లేదని, ఎదురుతిరిగి దాడి చేస్తున్నాయని, కాలనీవాసులు ప్రజలు, చెబుతున్నారు. మున్సిపల్ పట్టణంలో, మున్సిపల్ అధికారులు, చర్యలు చేపట్టి మున్సిపల్ పట్టణ ప్రజలను కాపాడాలని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సోమవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఓ కాలనీలో ఇంట్లోకి చేరి రెండు సంవత్సరాల పాప పై కోతులు దారుణంగా దాడి చేయడంతో ఆ పాపకు తీవ్ర అవస్థలు ఎదురయ్యాయి. చికిత్స నిమిత్తం పాపను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంకా కోతులు ఎంత మందిని కరుస్తాయోనని కాలనీవాసులు పట్టణ ప్రజలు భయాందోళనతో వనికి పోతున్నారు. కనుక మున్సిపల్ శాఖ అధికారులు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం కోతుల నుంచి వారిని కాపాడి కోతులను పట్టణంలో నుంచి తరిమే విధానానికి చర్యలు చేపట్టాలని ఎల్లారెడ్డి పురపాలక పట్టణ ప్రజలు అధికారులను వేడుకుంటున్నారు.