జనన,మరణాల ధ్రువీకరణ అధికారితో ప్రజల ఇక్కట్లు..
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో జనన ధ్రువీకరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చెందిన దాస్ పట్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు.
దిశ ,ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయంలో జనన ధ్రువీకరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చెందిన దాస్ పట్ల ప్రజలు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లో జనన ధ్రువీకరణ అధికారిగా పనిచేస్తున్న దాస్ ఆ సర్టిఫికెట్ల కోసం కార్యాలయానికి వెళ్లే.. ప్రజలు నానా అవస్థలు పడుతూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదాహరణకు ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్రానికి చెందిన ఇట్టేడి సంతోష్ కుమార్-అనిత దంపతుల ఇద్దరు కుమార్తెలు హర్షిత రెడ్డి, అక్షిత రెడ్డి లు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దావఖానాలో 2010, 2011 సంవత్సరంలలో జన్మించారు. ఆ సమయంలో నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయం నుండి అప్పట్లో ఈ దంపతులు వారి కుమార్తెల జనన ధ్రువీకరణ పత్రాలను పొందారు. అప్పట్లో మున్సిపల్ కార్యాలయాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు ఆన్లైన్ చేయలేదు.
ఈ ఇరువురు కుమార్తెలకు ఆధార్ కార్డుల్లో ఒక్క అక్షరం తప్పుగా నమోదయింది. వీటిని సరి చేసుకునేందుకు ఆ దంపతులు, ఆ ఇద్దరు కుమార్తెలు నానా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వారి కుమార్తెల ఆధార్ కార్డులు సరి చేయకపోవడంతో..పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. కానీ నిజామాబాద్ కార్పొరేషన్ లోని జనన,మరణ ధ్రువీకరణల అధికారి రాజు సైతం ఇవి ఏమీ లెక్కచేయకుండా వింత చేష్టలు చేస్తున్నారు. ఆ దంపతులు ఆ ఇద్దరు కుమార్తెల సర్టిఫికెట్ల కోసం ఇటీవల వారం క్రిందట మీ సేవలో సైతం దరఖాస్తు చేసుకొని..నిజామాబాద్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్తే ఎన్నిసార్లు తిరిగినా ఆ అధికారి కార్యాలయంలో దొరకడం లేదు. పైగా ఫోన్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ ఒక్క దంపతుల ముచ్చటే కాకుండా నిజామాబాద్ కార్పొరేషన్ జనన, మరణ ధ్రువీకరణల కోసం కార్యాలయానికి వచ్చే ప్రజలు అధికారి రాజుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ లోని జననం, మరణ ధ్రువీకరణ అధికారి దాస్ పనితీరు పట్ల కార్పొరేషన్ చైర్పర్సన్, కార్పొరేషన్ కమిషనర్ స్పందించి..ఆ అధికారి స్థానంలో మరొకరిని నియమించి ప్రజల ఇక్కట్లను తొలగించేలా చూడాలని జిల్లాలోని ప్రజలు కోరుతున్నారు.