రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి
రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.
దిశ, కామారెడ్డి : రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా.. మంగళవారం స్థానిక కళాభారతిలో రాష్ట్ర స్థాయి కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శనలు ప్రదర్శిస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళా శక్తి కార్యక్రమం క్రింద మైక్రో ఎంటర్ ప్రైసెస్, పాడి పరిశ్రమ, క్యాంటీన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. రైతుల సంక్షేమానికి జిల్లాలో 423 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి..వరి ధాన్యం కొనుగోలు చేస్తున్నదని, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.500/- బోనస్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా అంతడుపుల నాగరాజు బృందం కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. జిల్లా గ్రంధాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ...ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూ.లకే వంటగ్యాస్ సిలిండర్, రెండు లక్షల రుణ మాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నదని తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. అనంతరం అంతడుపుల నాగరాజు కళా బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధులు, పోతరాజులు, బతుకమ్మ వంటి వాటిపై నృత్య ప్రదర్శనలు, ప్రజా ప్రభుత్వం పిలిచింది, ప్రజా పాలన వచ్చింది అనే అంశాలపై నాటికలను సుమారు 75 మంది కళాకారులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి.విక్టర్, శ్రీనివాస్ రెడ్డి, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ రంగనాథ్ రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళలు, పాఠశాల విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.