పాల్దా సొసైటీలో రూ.40 లక్షలు గోల్‌మాల్.. కార్యదర్శి అనుమానాస్పద మృతి

Update: 2022-02-04 16:46 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో నిధుల గోల్ మాల్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని పాల్దా సొసైటీలో రూ.40 లక్షల నిధులు గోల్ మాల్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. సొసైటీ కార్యదర్శిగా ఉన్న అనిల్ రెడ్డి అనుమానాస్పద మరణం తర్వాత ఈ వ్యవహారం బయటకు రావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సొసైటీలో సుమారు రూ.40 లక్షల వరకు వానాకాలంకు సంబంధించి నిధులు గల్లంతయ్యాయని సొసైటీకి సంబంధించిన పాలకవర్గం స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌కు ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ మండలంలో అతిపెద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఒకటైనా పాల్దా సొసైటీకి సంబంధించిన నిధులు కార్యదర్శి అనిల్ రెడ్డికి మాత్రమే తెలుసని ఫిర్యాదు చేయడం గమనార్హం.

సిరికొండ మండలం గడ్కోల్‌కు చెందిన అనిల్ రెడ్డి గతంలో సిరికొండ మండలం సొసైటీలో పని చేసినప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నిజామాబాద్‌లో గంగాస్తాన్‌లో నివాసం ఉంటున్న అనిల్ రెడ్డి సొసైటీ కార్యదర్శిగా పని చేస్తునే రియల్ దందాలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల కోటి రూపాయల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఇటీవల తన సొంత పొలాన్ని అమ్మేందుకు సిద్ధమైన అనిల్ రెడ్డి ఈ నెల 1న ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమయ్యారు. ఈనెల 3న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాకతీయ కాలువ పక్కన చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించారు. అయితే అనిల్ రెడ్డి మరణానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనిల్ రెడ్డి వ్యక్తిత్వం తెలిసిన వారు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అలాంటి అవసరం లేదని చెబుతున్నారు. వికలాంగుడైన అనిల్ రెడ్డి ఒంటరిగా జగిత్యాల జిల్లా వరకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడా? మరేమైనా జరిగి ఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈనెల 1వ తేదీన అనిల్ రెడ్డి రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఆరోజు నుంచి అతని కోసం వెతుకులాట ప్రారంభమైంది. అనిల్ రెడ్డి హయంలో జరిగినట్లు చెబుతున్న నిధుల గోల్‌మాల్ వ్యవహారం చనిపోయాకే ఎందుకు బయటకు వచ్చిందనేది ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అనిల్ రెడ్డి అదృశ్యం అయిన రోజే పోలీసులు పెద్ద ఎత్తున ఆచూకీ కోసం ప్రయత్నించారు. అయినా, అతనికి సంబంధించిన సెల్ ఫోన్ సిగ్నల్స్ దొరకలేదు. సొసైటీలో నిధులు గల్లంతయినప్పుడు ఎందుకు పాలకవర్గం సైలెంట్‌గా ఉందన్న విషయం అంతు చిక్కడం లేదు. అనిల్ రెడ్డి కార్యదర్శిగా ఉన్నప్పుడు నిధుల మళ్ళింపు జరిగింా? లేదా? అనే విషయం మిస్టరీగా మారింది.

Tags:    

Similar News