నకిరేకల్ గడ్డ.. కాంగ్రెస్ అడ్డా...

అందరూ ఊహించినట్లుగానే మొదటి నుంచి గట్టి పట్టు ఉన్న నకిరేకల్ గడ్డ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారింది.

Update: 2023-12-03 10:47 GMT

దిశ, నకిరేకల్ : అందరూ ఊహించినట్లుగానే మొదటి నుంచి గట్టి పట్టు ఉన్న నకిరేకల్ గడ్డ మళ్లీ కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా మారింది. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ తో పాటుగా కోమటిరెడ్డి సోదరుల అండ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఈ నియోజకవర్గంలో కోమటిరెడ్డి సోదరులది పై చేయిగా సాగుతోంది. 2009, 2018 ఎన్నికల్లోను చిరుమర్తి లింగయ్యకు టికెట్ ఇప్పించి గెలిపించారు. చిరుమర్తి లింగయ్య పార్టీ మారడంతో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వేముల వీరేశం కు టికెట్ ఇప్పించి కోమటిరెడ్డి సోదరులు అండగా నిలిచారు.

ఇదంతా ఒకలా ఉంటే ప్రచార క్రమంలో కోమటిరెడ్డి సోదరుల పై చిరుమర్తి లింగయ్య చేసిన విమర్శలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయ భవిష్యత్తు కల్పించిన తమ పై ఆరోపణలు చేసిన చిరుమర్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని కంకణం కట్టుకున్న కోమటిరెడ్డి సోదరులు ఎత్తుకు పై ఎత్తులు వేసి వేముల వీరేశం గెలుపునకు కృషి చేశారు. అదే తరుణంలో వీరేశం కు సైతం నియోజకవర్గంలో సొంత క్యాడర్ ఉండటంతో భారీగా కలిసి వచ్చింది. కరోనా సమయంలోనూ వేముల వీరేశం ప్రజలకు ఎంతో సేవ చేశారు. వీటన్నింటితో పాటుగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ప్రతికూల వాతావరణం కలిసి రావడంతో నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం ఘన విజయం సాధించారు.

పట్టు నిరూపించుకున్న కోమటిరెడ్డి సోదరులు..

కోమటిరెడ్డి సోదరులకు నకిరేకల్ నియోజకవర్గం కావడంతో మొదటి నుంచి తమకు ఇక్కడ పట్టుంది. అదే క్రమంలో క్యాడర్ను చేజారకుండా ఉంచుకొని ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో వేముల వీరేశం ను గెలిపించి పట్టు నిరూపించుకున్నారు. తమను నమ్మిన కార్యకర్తలకు అనునిత్యం అండగా ఉంటామని ఈ అంశం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేసినట్లుగా ప్రచారం జరుగుతుంది.

ఊహించని రీతిలో మెజారిటీ...

నకిరేకల్ నియోజకవర్గంలో పోటీ చేసిన వేముల వీరేశం, చిరుమర్తి లింగయ్యలకు క్యాడర్ తో పాటుగా మంచి గుర్తింపు ఉంది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో పోటాపోటీగా ఉండడంతో ఫైట్ గా ఉంటుందని ప్రచారం జరిగింది. అయినప్పటికీ ఎవరు ఊహించని రీతిలో 50 వేల పైచిలుకు మెజారిటీతో వేముల వీరేశం గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు.

Tags:    

Similar News