మెడికల్‌ షాపులలో అడ్డగోలు వ్యాపారం

మండలంలోని మెడికల్ హాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా మందుల విక్రయాలు, అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు.

Update: 2024-11-25 11:31 GMT

దిశ, తిరుమలగిరి: మండలంలోని మెడికల్ హాల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా మందుల విక్రయాలు, అక్రమ వ్యాపారాలు సాగిస్తున్నారు. ఫార్మసిస్టులు ఉండరు..అనుమతులు ఒకరి పేరుపై ఉంటే..మందులు ఇచ్చేవారు మరొకరు. రోగం పేరు చెబితే చాలు వాళ్లే డాక్టర్లుగా మారి పరిమితికి మించిన మందుల ఇస్తూ..వైద్యం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో మెడికల్ నిర్వాహకులు చెలగాటమాడుతున్నారు.  పట్టించుకోవాల్సిన వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు,డ్రగ్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించకుండా నిద్రావస్థలో ఉన్నారనేది ప్రజల్లో వస్తున్న ఆరోపణలు. నిషేధిత మందులను సైతం యథేచ్ఛగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ప్రజలు వాపోతున్నారు. గ్రామాల్లో వచ్చి,రానీ వైద్యంతో ఆర్ఎంపీ డాక్టర్లు పరిమితికి మించి హైడోస్ ఇస్తూ..రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనేది ప్రజల్లో వ్యక్తమవుతున్న మాట. ప్రభుత్వ దావఖానాల్లో చూపించుకుందామంటే..రెండు గంటల తర్వాత నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయించి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో..ప్రభుత్వ దావాఖానాల్లోకి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకోవాలో అయోమయంలో ప్రజల పరిస్థితి ఆందోళనగా ఉంది. ఇలాంటి అరాచకాలు అరికట్టడానికి ఎన్ని వార్త కథనాలు ప్రచురించినప్పటికీని అధికారుల్లో స్పందన రావడంలేదని, తూ..తూ మంత్రంగానే తనిఖీలు నిర్వహించి చేతులు దులిపేసుకుంటున్నారని స్థానికులు వాపోతున్నారు. 


Similar News