తుంగతుర్తిలో కూడా ప్రజా దర్బార్.. మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి

సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో మాదిరిగా ఇకపై నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో కూడా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నట్లు మాజీమంత్రి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-07-03 15:05 GMT

దిశ, తుంగతుర్తి : సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో మాదిరిగా ఇకపై నియోజకవర్గ కేంద్రమైన తుంగతుర్తిలో కూడా ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టబోతున్నట్లు మాజీమంత్రి, తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో జరిగిన ఎంపీటీసీ మడ్డి నాగలక్ష్మి కృష్ణమూర్తి పదవి వీడ్కోలు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సూర్యాపేటలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ వల్ల తాను బిజీ షెడ్యూల్లో ఉంటున్న దృష్ట్యా ఏఐసీసీ సభ్యులైన తన కుమారుడు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి నేతృత్వంలో తుంగతుర్తిలో ప్రజాదర్బార్ కొనసాగుతుందని తెలిపారు. తాను కూడా సందర్భాలపరంగా దీన్ని పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలను దరఖాస్తుల ద్వారా స్వీకరిస్తూ వాటిని పరిష్కరించే క్రమంలో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిజమైన కార్యకర్తలను గుర్తిస్తూ వారికి అండగా ఉంటానని స్పష్టం చేశారు.

ఇప్పటికే దశాబ్దాల కాలంగా తనతో పాటు పార్టీని నమ్ముకున్న వాళ్లంతా తనకు అండగా నిలిచారని ఈ మేరకు వారెవరిని కూడా మర్చిపోనని స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ పార్టీ క్యాడర్ వల్లే తాను అనేక పదవులు పొందుతూ ఈ స్థాయికి చేరానని పేర్కొన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి తన హయాంలో జరిగిందన్నారు. రోడ్లు, విద్యుత్, విద్య, వైద్యం, తదితర రంగాలన్నింటికీ అధిక ప్రాముఖ్యతను ఇస్తూ అభివృద్ధి చేశానని గుర్తు చేశారు. ముఖ్యంగా ప్రజల చిరకాల వాంఛగా నిలిచిపోయిన శ్రీరామ్ సాగర్ రెండో దశ సాధనకు ఆనాడు అనేక పోరాటాలు చేసి సాధించిన ఘనత తనదేనని, ఫలితంగా నేడు తుంగతుర్తి ప్రాంతం ఆ నీటితో లబ్ధి పొందుతోందని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ, మహిళా కమిటీ అధ్యక్షులు చెవిటి వెంకన్న, తిరుమల ప్రగడ అనురాధ కిషన్ రావు, పీసీసీ సభ్యులు గుడిపాటి నరసయ్య, నాగారం, మద్దిరాల మండలాల పార్టీ అధ్యక్షులు తొడుసు లింగయ్య, ఐలమల్లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News