రిజిస్ట్రేషన్ ఆఫీస్ అంతా ఆయన కనుసన్నల్లోనే ...!!

ఆ ప్రభుత్వ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డగా మారింది...ఇక్కడ జరిగే ప్రతి అవినీతి అక్రమాలకు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కీలక భూమిక పోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

Update: 2024-07-05 10:56 GMT

దిశ, నల్గొండ బ్యూరో : ఆ ప్రభుత్వ కార్యాలయం అక్రమ వసూళ్లకు అడ్డగా మారింది...ఇక్కడ జరిగే ప్రతి అవినీతి అక్రమాలకు కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి కీలక భూమిక పోషిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన కింది స్థాయి ఉద్యోగి అయినప్పటికీ కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులను అనేక రకాల ప్రలోభాలకు గురి చేస్తూ అక్కడ జరిగే ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించి, తద్వారా అక్రమ వసూళ్ల దందాకు ఆ అధికారి తెరలేపినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎక్కడో కాదు చండూరు డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నిత్యం జరిగే తతంగం.

నివాస యోగ్యం కాని భూమిని, ఇళ్ల స్థలాలుగా రిజిస్ట్రేషన్ చేయడం. దశాబ్దాల క్రితం ఇళ్లు నిర్మాణం చేసినప్పటికీ.. ఈ మధ్యనే నిర్మాణం జరిగినట్టు రిజిస్ట్రేషన్ చేయడం. వెంచర్లలో గ్రామపంచాయతీకి కేటాయించిన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవసరమైన సహకారం లాంటి పనులన్నీ కూడా ఆ ఉద్యోగి కనుసన్నల్లోనే జరుగుతాయని విమర్శలు ఉన్నాయి. కార్యాలయంలో ఉండే అధికారి అలాంటి పనులకు అభ్యంతరం చెబితే బలవంతంగా నైనా సరే... వారితో సెలవు పెట్టించి ఇన్ చార్జ్ అధికారితో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేస్తారని చర్చ కార్యాలయంలో జోరుగా సాగుతోంది.

సబ్ రిజిస్టార్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్న భూమిలో గత 20 ఏళ్లుగా నివాసముంటున్నట్లు కొంతమందికి పత్రాలు సృష్టించి మరీ రిజిస్ట్రేషన్ చేశారని ఆ ఉద్యోగిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో అక్రమ పూర్వసేది చేసుకున్న కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ రిజిస్ట్రేషన్ పంతులు ఆ ఉద్యోగి పాత్ర కీలకంగా ఉంది.

చండూరు గ్రామపంచాయతీ గా ఉన్నప్పుడు ఇంటి టాక్స్ కట్టిన ధ్రువీకరణ పత్రాలతో ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే విధానం కార్యాలయంలో జరుగుతుంది. దీనికి ఓ రేటు నిర్ణయించి ,పని పూర్తి చేసి ,అక్రమ వసూళ్లు చేయడంలో ఆ ఉద్యోగి కీలక సూత్రధారని సమాచారం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం దంపతులు తమ వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెళ్లిన , ప్రేమ వివాహం చేసుకునే దంపతుల పెళ్లికి కూడా సవా లక్ష కొర్రీలు పెడతారని, ఒకవేళ చేతిలో లంచం పెడితే పని సాఫీగా చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక జంట నుంచి రూ.5 నుంచి రూ.10వేలు వసూలు చేస్తారని కార్యాలయ సిబ్బంది గుసగుసలాడుతున్నారు.

కార్యాలయంలో జరిగే అక్రమాలను ఎవరైనా ప్రశ్నించిన లేదా వార్తలు రాసేందుకు వెళ్లిన వాళ్లను ప్రలోభాలకు గురి చేయడం లేదా పోలీస్ కేసులు పెట్టి బెదిరించడం ఇలాంటి పనులు చేయడంలో అతనిదే అందే వేసిన చేయి అని కార్యాలయ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే ప్రజల నుంచి, ప్రతి రిజిస్ట్రేషన్ పేరుతో రోజు మామూలు వసూలు చేసి అధికారులకు అండదండలుగా ఉంటూ అదే స్థాయిలో తాను కూడా కొంత మొత్తం సొమ్ము వెనుకేసుకుంటాడన్నాని విశ్వసినీ వర్గాల ద్వారా సమాచారం.


Similar News