కెమికల్ వ్యర్థాలపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల పరిశీలన

కలుషిత వ్యర్థ రసాయన నీటిని వదులుతున్న మండలంలోని రామలింగంపల్లి శివారులో పర్వ్యు(కెమికల్స్ బాలాజీ కెమికల్స్) కంపెనీ

Update: 2024-07-05 14:20 GMT

దిశ, బొమ్మలరామారం : కలుషిత వ్యర్థ రసాయన నీటిని వదులుతున్న మండలంలోని రామలింగంపల్లి శివారులో పర్వ్యు(కెమికల్స్ బాలాజీ కెమికల్స్) కంపెనీ పై గ్రామస్తుల ద్వారా వచ్చిన ఫిర్యాదుల మేరకు నల్గొండ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ పి. సురేష్ బాబు , జిల్లా ఇండస్ట్రీస్ అధికారి రాజేశ్వర్ రెడ్డి, జిల్లా వెటర్నరీ అధికారి ఐలయ్య లు కంపెనీ పరిసరాలను శుక్రవారం సందర్శించి నీటి నమూనాలను సేకరించి, గ్రామస్తులతో బహిరంగ విచారణ నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పిసిబి అధికారులతో గ్రామస్తులు మాట్లాడుతూ.. స్థానిక రామయ్య చెరువు లోకి కంపెనీ నుంచి రసాయన వ్యర్ధాలను వదులుతున్నారని, దీని ద్వారా గ్రామంలోని రైతులకు తీవ్ర ఇబ్బంది జరుగుతుందని తెలియజేశారు.

నెల క్రితం గ్రామానికి చెందిన రైతులు పాక బిక్షపతి, శ్రీనివాస్, మచ్చని సుమన్ యాదవ్ లకు చెందిన రెండు బర్రెలు, సుమారు 50 గొర్రెలు కలుషిత నీటిని తాగి మృతి చెందాయని తెలిపారు. గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చెరువు నీటిని పరిశీలనకై తీసుకెళ్లిన రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పారు. మూగజీవాల మృత్యువుకు కారణం అయిన కంపెనీ పై చర్యలు తీసుకోవాలని కోరారు. పశువులు , గొర్రెలు మరణాలకు కలుషిత నీరు తాగడం వలన చనిపోయినట్లు పశువైద్యాధికారులు తెలిపినా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దృష్టికి తీసు తీసుకెళ్లామన్నారు.

కంపెనీ నుంచి పైపు ద్వారా వర్షాకాలంలో గుట్టలమీదుగా ప్రవహించే గౌతమ్ వాగులోకి రసాయన వ్యర్ధాలు చేరి రామయ్య చెరువులోకి వస్తున్నాయన్నారు. గ్రామ జీవాల పెంపకం దార్లు, పశు రైతులకు ఆ నీరు మృత్యు గండంగా మారిందని ఆవేదన వెలిబుచ్చారు. వెంటనే కంపెనీ పై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. కంపెనీ లోపల, ఇతర పరిసరాలతో పాటు చెరువులోని నీటి శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపిస్తున్నట్లు పిసీబీ అధికారులు తెలిపారు. వారం రోజుల్లోపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన రిపోర్టు ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీనివాసరావు, గ్రామస్తులు, రైతులు ఉన్నారు.

.


Similar News