కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం.. టీఆర్ఎస్ ఎంపీ కీలక వ్యాఖ్యలు

Update: 2022-02-05 13:51 GMT

దిశ, కోదాడ: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను తట్టుకోలేక బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు చౌకబారు విమర్శలకు దిగుతున్నారని రాజ్యసభ సభ్యుడు, సూర్యాపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన అనంతరం శనివారం మొట్టమొదటిసారిగా ఆయన కోదాడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో కూడా కోదాడలో టీఆర్ఎస్ జెండా ఎగురుతుందని ఆయన అన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయమని అన్నారు.

టీఆర్ఎస్ పార్టీతో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాలకు సమ న్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరెంటు, రైతు రుణ మాఫీ, రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలపై  పలు రాష్ట్రాల ఎంపీలు ప్రశంసిస్తున్నారని అన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎలా సాధ్యమవుతుందని,  ఇటువంటి సీఎం  దేశానికి ఎంతో అవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అంబేద్కర్ పుణ్యంతోనే రాజ్యంగ ఫలాలు అన్ని వర్గాలకు అందుతున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరికీ రాజ్యాంగ ఫలాలు అందేలా కృషి చేస్తున్నారని అన్నారు.

రాజ్యాంగ ఫలాలు గతం కంటే ఎక్కువగా ప్రజలకు అందాలనే ఉద్దేశ్యంతోనే మార్పులు రావాలి అన్నారే తప్ప  రాజ్యాంగాన్ని గానీ అంబేద్కర్‌ని గానీ సీఎం కేసీఆర్ విమర్శించలేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బురద చల్లేందుకే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విమర్శించారు. దళిత బంధు పథకం అన్ని నియోజకవర్గాలకు అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా బడుగుల లింగయ్య యాదవ్‌ను ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ స్థానిక టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ ,ఎంపీపీలు చింత కవిత రాధారెడ్డి, చుండూరు వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షుడు చందు నాగేశ్వరావు, మహిళా అధ్యక్షురాలు ఇర్ల రోజా రమణి, కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు పాయిలి కోటేశ్వరరావు, సర్పంచులు సాధినేని లీల అప్పారావు, పొట్ట శ్రీ విజయ కిరణ్ కుమార్, శెట్టి సురేష్ నాయుడు, దారావత్ బాబ్జి నాయక్, సంపేట ఉపేందర్ గౌడ్, బత్తుల ఉపేందర్, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News