తుంగతుర్తిలో బోల్తాపడ్డ కారు..
పదేళ్లపాటు జెట్ స్పీడుతో పరుగులు పెట్టిన కారు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి బోల్తా కొట్టింది.
దిశ, తుంగతుర్తి : పదేళ్లపాటు జెట్ స్పీడుతో పరుగులు పెట్టిన కారు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి బోల్తా కొట్టింది. కనీసం చెప్పుకోవడానికైనా దాని ఆకారం కనిపించకుండా పోయింది. ముఖ్యంగా ప్రతిరౌండ్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామెల్ మెజార్టీలో కొనసాగిన తుంగతుర్తి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో రికార్డుగా నిలిచింది. ముఖ్యంగా కిషోర్ ఓటమికి, సామెల్ విజయం వెనక అనేక కారణాలు చోటుచేసుకున్నాయి.
గాదరి కిషోర్ కుమార్ ఓటమికి కారణాలు ఇవే..
పదేళ్లపాటు తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రారాజుగా కొనసాగిన గాదరి కిషోర్ కుమార్ ఈసారి కూడా తనకు ఓటమే లేదంటూ విర్రవీగుతూ వచ్చారు. అయితే ఆయన తన వెనుకున్న మైనస్ పాయింట్లు గ్రహించలేకపోయారు. ముఖ్యంగా ఇసుక తరలింపు వ్యవహారం కిషోర్ కుమార్ గెలుపునకు ప్రధాన గండి కొట్టింది. తిరుమలగిరి, నాగారం, అడ్డగూడూరు, జాజిరెడ్డిగూడెం మండలాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న మూసివాగు నుండి పెద్దఎత్తున ఇసుక తరలింపు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.
అయినా కూడా అవేమీ పట్టించుకోలేదు. అలాగే రాష్ట్రంలోనే తొలిసారిగా పైలెట్ ప్రాజెక్టుగా దళిత బందు కింద ఎంపికైన తిరుమలగిరి మండలంలో విచ్చలవిడిగా అవినీతి కొనసాగింది. బ్రోకర్లు కొనసాగించిన ఇష్టా రాజ్యం రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ విషయం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినప్పటికీ పట్టించుకోలేదని అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇవే కాకుండా 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ప్రధానమైనవన్నీ అమలుకు నోచుకోలేదు. ఆర్టీసీ డిపో, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు, తుంగతుర్తిలో వంద పడకల ఆసుపత్రి ఏర్పాటులో జాప్యం వెంపటి, వెలుగు పల్లి గ్రామాలలో రిజర్వాయర్ల ఏర్పాటు వంటివన్నీ పెండింగ్ లోనే కూరుకుపోయాయి.
ఇదిలా ఉంటే కొంతమంది నాయకులను, ముఖ్య కార్యకర్తల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణ ఆ పార్టీలోనే ప్రచారంగా కొనసాగింది. ఇవన్నీ ఇలా ఉంటే మాదిగ సామాజిక వర్గాన్ని దూషించడం వల్ల ఏర్పడ్డ వ్యతిరేకత, స్థానికేతరుడు కావడం, అక్రమాలను ప్రశ్నించిన వారి పై దాడులు చేయడం, ముఖ్యనేతల సూచనలు పట్టించుకోకపోవడం, ఆయా మండలాలలో ఉన్న పార్టీ నాయకుల పట్ల ప్రజల నుండి వ్యతిరేకత కిషోర్ ఓటమికి కారణాలయ్యాయి.
మందుల సామేలుకు కలిసి వచ్చిన అంశాలు..
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ విజయానికి అనేక అంశాలు కలిసి వచ్చాయి. ప్రధానంగా కిషోర్ కుమార్ పై ఉన్న వ్యతిరేకతంతా ప్రధానంగా కలిసి వచ్చింది. దీనికి తోడు 23 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో పనిచేసినప్పటికీ సామెల్ కు ఏనాడు కూడా పోటీ చేసే అవకాశం రాకపోవడం లాంటి సానుభూతి కాంగ్రెస్ పార్టీలో కలిసి వచ్చింది. అంతేకాకుండా సామెల్ మంచితనం, అందరితో మమేకం కావడం, చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుని వరకు కూడా గుర్తిస్తూ పేరుతో పలకరించడం, కుశల ప్రశ్నలు ఆప్యాయతతో వేయడం లాంటివన్నీ కలిసి వచ్చాయి. ముఖ్యంగా 23 ఏండ్లపాటు తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో సాన్నిత్యం కలిగి ఉండడం కలిసి వచ్చింది. పైగా రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందనే అంశం కూడా కలిసి వచ్చింది. దీనికి తోడు అసమ్మతి లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయడం మరో కీలక అంశం.