తొలి జాబితాలో పేరు దక్కించుకున్న కడియం
కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పోటీ అభ్యర్థి ఎవరనే విషయం ఆదివారం తేలిపోయింది.
దిశ, తుంగతుర్తి: కొంతకాలంగా ఊరిస్తూ వస్తున్న తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గ పోటీ అభ్యర్థి ఎవరనే విషయం ఆదివారం తేలిపోయింది. ఈ మేరకు కడియం రామచంద్రయ్యను అభ్యర్థిగా బీజేపీ అగ్ర నాయకత్వం ప్రకటించింది. దీంతో ఆయన తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి పోటీలో దిగనున్నారు. 2018 లో తొలిసారిగా పోటీ చేసిన రామచంద్రయ్య కేవలం 3,222 ఓట్లుకే పరిమితమయ్యారు. కాగా ఈసారి తుంగతుర్తి నుంచి పోటీ చేయడానికి స్థానికతతో పాటు స్థానికేతరులు కూడా ముందుకొచ్చారు. దీంతో వారి సంఖ్య అరడజనుకు పైగానే చేరింది. కడియం రామచంద్రయ్యతో పాటు తుంగతుర్తికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు మల్లెపాక సాయిబాబు, పాల్వాయి రజని కుమారి, తదితరులు ఇందులో ప్రధానంగా ఉన్నారు. ఈ మేరకు పార్టీ అధిష్టానానికి దరఖాస్తులకు చేసుకున్నారు.
25న అసమ్మతి నేత సాయిబాబా అనుచరులతో సమావేశం
సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మల్లెపాక సాయిబాబు తనకు టికెట్ రాకపోవడంతో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఈనెల 25న తుంగతుర్తిలో తన వర్గీయులతో ఒక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో అనుచర వర్గ సూచనల మేరకు రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని సాయిబాబు ఆదివారం సాయంత్రం “దిశ”తో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. 2018 లో కూడా టికెట్ ఆశిస్తే ఫలితం దక్కలేదని వాపోయారు. సుమారు 60 వేల చిలుకు ఉన్న మాదిగ సామాజిక వర్గాన్ని పార్టీ విస్మరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ, తుంగతుర్తి ప్రాంత అభివృద్ధి కోసం వివిధ రకాల పోరాటాలు చేశానని వివరించారు. అయినా రాజకీయ జీవితానికి గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే సాయిబాబు మొదటి నుంచి మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావునే తన అధిష్టానంగా భావిస్తూ ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నారు.