భువనగిరి పై కాంగ్రెస్ జెండా..
భువనగిరి గడ్డ పై 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది.
దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : భువనగిరి గడ్డ పై 40 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెపలాడింది. అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి పై ఘనవిజయం సాధించారు. కుంభం అనిల్ కుమార్ రెడ్డి 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యల పట్ల పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లారు. ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలను నాయకులకు అనుక్షణం అండగా ఉండి పోరాటాలు నిర్వహించారు. ఇటు కాంగ్రెస్ పార్టీ పక్క రాష్ట్రంలో కొనసాగుతుండడం, 6 గ్యారంటీల ఫార్ములా సైతం అనిల్ కుమార్ రెడ్డి గెలుపునకు సహకరించింది.
పలు సంక్షేమ పథకాల పై ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లడం ఆయనకు సహకరించింది. దీంతో పాటు భువనగిరి నియోజకవర్గంలోని త్రిబుల్ ఆర్ అంశం, భువనగిరిలో డిగ్రీ కాలేజ్ లేకపోవడం, సంక్షేమ పథకాలు పలువురికి అందకపోవడం, అధికారం పై వ్యతిరేకత, శేఖర్ రెడ్డి పై వ్యతిరేకత లాంటి కార్యక్రమాలు అనిల్ రెడ్డికి దోహదపడ్డాయి. భువనగిరి నియోజకవర్గంలో సైతం వర్గ పోరు పూర్తిగా తొలగిపోవడం ప్రధాన బలంగా నిలిచింది. అనిల్ కుమార్ రెడ్డి కరోనా సమయంలో చేసిన సేవలు సైతం ఆయన గెలుపునకు దోహదపడ్డాయి. ఈ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోవడం, ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్లో అనిల్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారు.
బీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి కి ఓటమిలో ప్రధానంగా ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత కారణం అయింది. ప్రభుత్వం సంక్షేమ పథకాలు పలువురికి చేరకపోవడం కారణం అయింది. ప్రధానంగా ట్రిపుల్ ఆర్ అంశం కూడా కారణమైంది. దీంతో పాటుగా నియోజకవర్గంలోని పలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం సైతం కారణమైందని పలువురు భావిస్తున్నారు.