నల్గొండ జిల్లాలో సీఎం KCR పర్యటన

నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

Update: 2022-11-28 10:19 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో వెళ్లిన సీఎం కేసీఆర్ దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ప్లాంట్‌ పనుల పురోగతిని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం ప్లాంట్‌ నిర్మాణపనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పవర్‌ప్లాంటు నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ నిర్మాణ పనులపై అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేసే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌ వెంట యాదాద్రి పవర్ ప్లాంట్ సందర్శనలో ఎంపీ సంతోష్, పలువురు ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. తర్వాత సాయంత్రం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు. దామరచర్ల మండలం వీర్లపాలెంలో సీఎం కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

థర్మల్ ప్లాంట్ పురగోతని కేసీఆర్ ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తున్న నేపథ్యంలో ప్లాంట్‌లోకి అనుమతివ్వాలని ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు కోరారు. కాగా, 2015 జూన్‌లో రూ. 29,992 కోట్లతో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ప్రాజెక్ట్ 2021 అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని భావించినా కోవిడ్, ఇతర పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదు. ఇక, ఇప్పటికే ప్లాంట్‌లో రెండు యూనిట్ల పనులు 90 శాతం పూర్తయ్యాయి. మిగతా మూడు యూనిట్లు 70 శాతం వరకు అయ్యాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లోగా మొదటి యూనిట్‌ ద్వారా 800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసేలా పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సీఎం పర్యటనలో ఉద్రిక్తత..

దామరచర్లలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్‌ పవర్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పవర్ ప్లాంట్ భూ నిర్వాసితులు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. 

Tags:    

Similar News