సమస్యల వలయంలో కళావిహీనంగా మారిన బాలభవన్..

నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని గౌతమ బాలవిహార్ లో గల బాలభవన్ సమస్యల వలయంగా మారింది.

Update: 2024-07-03 16:06 GMT

దిశ, నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని గౌతమ బాలవిహార్ లో గల బాలభవన్ సమస్యల వలయంగా మారింది. గతంలో ఎంతో మంది విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలు, డ్రాయింగ్, టైలరింగ్ విభాగాలలో శిక్షణ నిచ్చిన బాల భవన్ నేడు నిరుపయోగంగా మారి కళా విహీనంగా తయారైంది. దానికి తోడు బాల భవన్ లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు విధులకు డుమ్మా కొడుతూ లక్షల్లో జీతాలు పొందుతున్నారని స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రతిరోజు విధులకు హాజరు కావాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలకు హాజరు కాకపోగా ఎప్పుడో ఒకసారి వచ్చి సంతకాలు పెట్టుకొని జీతాలు పొందడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో వేసవికాలంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి చిన్నారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేవారు.

సాంస్కృతిక కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి, ఇప్పుడు పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. బాల భవన్ కు సంబంధించి విధుల నిర్వహణలో మొత్తం ఆరుగురు ఉపాధ్యాయులు, ఒక అటెండర్, ఒక ఆయా మొత్తం 8 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు, ఒక ఆయా పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రస్తుతానికి 5గురు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. అందులో నలుగురు ఉపాధ్యాయులు, ఒక అటెండర్ ఉన్నారు. అందులో ముగ్గురు ఉపాధ్యాయులు విధులకు హాజరు కాకుండా డుమ్మా కొడుతూ సంతకాలకే పరిమితమవుతూ లక్షల్లో జీతభత్యాలు పొందుతున్నారని స్థానికుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బాల భవన్ కు విద్యార్థులు క్యూ కట్టేవారు కానీ ఇప్పటి పరిస్థితులు ఇందుకు భిన్నంగా మారిందని స్థానికుల ఆరోపణ. ఉపాధ్యాయులు డుమ్మాతో పాటు సరైన గైడ్ లేక విద్యార్థులు బాలభవన్ కు రావడమే మానేశారు. టైలరింగ్ సంబంధించి కుట్టుమిషన్లు, కార్యాలయానికి సంభందించి కంప్యూటర్లు, సాంస్కృతిక కార్యక్రమాలకు సంభందించి వివిధ పరికరాలు నిరుపయోగంగా మారి స్టోర్ రూమ్ కె పరిమితమయ్యాయి బాల భవన్ పై అధికారులు పర్యవేక్షణ లోపం వల్ల ఈ విధంగా ఉపాధ్యాయులు వారికి నచ్చినట్లుగా విధులకు హాజరు అవుతున్నారని, ఇప్పటికైనా సంబంధిత అధికారులు పర్యవేక్షించి విధులకు హాజరు కాని ఉపాధ్యాయుల పై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సమస్యలను సాకుగా చూపుతున్న ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులు విధులకు హాజరు కావడం లేదని తెలియడంతో తమ సమస్యలను కారణంగా చూపుతున్నారు. గదులు సరిగా లేవని, మంచినీటి వసతి లేదని, మూత్రశాలలు సరిగా లేవని, బాలవిహార్ ను డ్యాంకు రక్షణగా వచ్చిన సీఆర్పీఎఫ్ పోలీసులకు వసతిగా ఇవ్వటాన్ని సాకుగా చూపిస్తున్నారు. బాల భవన్ నృత్యశాలను కూడా సీఆర్పీఎఫ్ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని, వీరు ఉండటం వల్ల వచ్చే కొద్ది మంది చిన్న పిల్లలు కూడా భయపడి రావట్లేదని ఉపాధ్యాయులు తెలియజేశారు.

బాల భవన్ పర్యవేక్షకులు బక్కయ్యను ఉపాధ్యాయుల గైర్హాజరు పై వివరణ కోరగా ఒక ఉపాధ్యాయుడు ఆరోగ్యపరమైన సమస్యల వల్ల విధులకు హాజరు కావట్లేదని అన్నారు. మరొక ఉపాధ్యాయురాలు డిప్యూటేషన్ పై వేరే ఊర్లో పనిచేస్తున్నారని తెలిపారు. తనకు జిల్లా స్థాయి అధికారుల కార్యక్రమాల పర్యవేక్షణకే సమయం సరిపోతుందని, 2020 సంవత్సరం నుండి ఇక్కడ ఎటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని జిల్లా స్థాయిలోనే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలియజేసి, బాల భవన్ ను యధావిధిగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.


Similar News