‘పెద్దలు రుణాలు ఎగ్గొడుతుంటే పేదలకు షరతులేంటి?’.. ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్

పేద ప్రజలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

Update: 2024-09-20 15:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పెద్దలు బ్యాంక్ రుణాలు ఎగ్గొడుతున్నారని, కానీ మహిళా సంఘాలు 98 శాతం రిపేమెంట్ చేస్తున్నాయని, అందుకే పేదలకు బ్యాంకులు షరతులు లేకుండా రుణాలు ఇవ్వాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్‌లో పీఎం విశ్వకర్మ పథకం మొదటి వార్షికోత్సవ సమావేశానికి ఈటల రాజేందర్ శుక్రవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ట్రైనింగ్ పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

నైపుణ్యం, సృజనాత్మకత ఉన్న వారికి ఆర్థికసాయం అందిస్తే అద్భుతాలు సృష్టిస్తారన్నారు. ప్రాచీన వృత్తులు కాపాడుకోవాలని, దీనికోసం తాను మంత్రిగా ఉన్నప్పుడు నిత్యం ఆరాటపడినట్లు గుర్తుచేశారు. ఆడపిల్లలు సమాజంలో సమానంగా ఎదుగుతున్నారని, తిండికి లేకపోయినా తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారని, దీని వెనుక వారి ఎంతో కృషి దాగి ఉందన్నారు. వృత్తి పనులు చేసే వారు సమాజం మేలు కోరుతారని చెప్పుకొచ్చారు. చేతి వృత్తులు కొనసాగిస్తున్న వారికి ఏం ఇచ్చినా తక్కువేనన్నారు. చేతి వృత్తుల వారిపై ప్రజల్లో మైండ్ సెట్ మారాలని, వారిపై చిన్న చూపు తగదన్నారు. ఇదిలా ఉండగా దేశంలో తెల్లరేషన్ కార్డు సంఖ్య తగ్గాలని, ఉచితాలు వద్దు ఎవరికి వారుగా బతకగలం అనే స్థాయి ప్రజల్లో రావాలని ఈటల ఆకాంక్షించారు.


Similar News