మహిళలపై ఇంకా వివక్షత కొనసాగడం బాధాకరం: మంత్రి సీతక్క

సమాజ సృష్టికి మూలమైన మహిళల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-09-20 17:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: సమాజ సృష్టికి మూలమైన మహిళల పట్ల ఇంకా వివక్షత కొనసాగుతుందని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. వివక్షత కారణంగా మహిళలు ఇంకా వెనుకబడి ఉన్నారని చెప్పారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా, పురుషులే గొప్ప అనే భావన సమాజంలో నాటుకుపోయింది అని పేర్కొన్నారు. తాము తక్కువ అనే ఆలోచన నుంచి మహిళలు బయటపడాలని కోరారు. మాదాపూర్ లోని టెక్ మహీంద్రా క్యాంపస్ లో సీఐఐ, ఇండియన్ వుమెన్ నెట్‌వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్‌షిప్ సదస్సును ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క మాట్లాడారు. మహిళా సాధికారత కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే లక్ష్యంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకున్న తాను మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా రాష్ట్ర ప్రజలకు సేవలందిస్తున్నట్లు తెలిపారు.

ఒక ఆదివాసీ మహిళకు… పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి వంటి పెద్ద శాఖను అప్పగిస్తే… 13 వేల గ్రామ పంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యతను చాలెంజ్ గా స్వీకరించి పట్టుదలతో పని చేస్తున్నట్లు చెప్పారు. పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలని, ఆ దిశలో పరిశ్రమలు, ప్రభుత్వం కలిసి పని చేయాలని కోరారు. వర్క్ ప్లేస్ లో మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుందని ప్రశ్నించారు. మహిళలు తమ పని ప్రాంతాల్లో సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలని సూచించారు. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదన్నారు. వర్కింగ్ ఉమెన్‌కు ఎదురవుతున్న సవాళ్లను, సమస్యలను తమ దృష్టికి తీసుకు వస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తామన్నారు. వ్యాపారాలు, పరిశ్రమలు పట్టణాలకే పరిమితం కాకూడదన్నారు. మన మూలాలను వెతుక్కుంటూ గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు నెలకొల్పాలని సూచించారు. విదేశీ వస్తువులను దిగుమతులు చేసుకునే మనం, పల్లె వస్తువులను ఎందుకు ప్రోత్సహించడం లేదని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయన్నారు. అభివృద్ధి ఒకే చోట కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని మంత్రి ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు రావాలని ఒక గ్రామీణ బిడ్డగా తాను అదే కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్య శిక్షణ ముందుకు రావాలని, సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టి సాధించారని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే దిశగా పరిశ్రమలు ముందుకు రావాలని చెప్పారు. సవాల్లు ఎదురైనప్పుడు మహిళలు పారిపోకూడదని, సవాల్లను చాలెంజ్ గా తీసుకొని నిలదొక్కుకోవాలని సూచించారు. మహిళా భద్రత, సాధికారత కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మహిళల భద్రత కోసం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న టి సేఫ్ యాప్… ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. లింగ సమానత్వం రావాలంటే అన్నిచోట్ల మహిళలు ముందుకు రావాలన్నారు. మహిళలపై ఎలాంటి వివక్షత చూపకుండా సమాన అవకాశాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలకు సూచించారు.

పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉన్న మహిళలు.. వెనుకబాటుతనంలో ఉన్న మహిళలకు తోడ్పాటు నందిస్తే.. మహిళలు అభివృద్ధి బాటలో నిలుస్తారని తెలిపారు. మహిళలకు మానవత్వం ఎక్కువగా ఉంటుంది… సమస్యల్లో ఉన్నవారికి అక్కలా, చెల్లెలా, తల్లిలా చేయూత నివ్వాలని కోరారు. యంగ్ ఇండియాలో నిరుద్యోగము పెద్ద సమస్యగా మారిందని… గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచితే కాస్తైన నిరుద్యోగం తగ్గుతుందని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పరిశ్రమ కవితలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐడబ్ల్యూఎన్ తెలంగాణ చైర్ పర్సన్ అనుపమ పండురు, సిఐఐ తెలంగాణ చైర్మన్ సాయి ప్రసాద్, యూఎస్ కాన్సులేట్ హైదరాబాద్ పబ్లిక్ డిప్లొమా ఆఫీసర్ ఏమిలియ స్మిత్, సిఐఐ మాజీ చైర్మన్ బివిఆర్ మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.


Similar News