టీపీసీసీ చీఫ్ సన్మాన కార్యక్రమం పోస్టర్‌ను ఆవిష్కరించిన మంత్రి కొండా సురేఖ

బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలోని మంత్రి నివాసంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి సభ్యులు కలిశారు.

Update: 2024-09-20 16:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే కాలనీలోని మంత్రి నివాసంలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి సభ్యులు కలిశారు. ఈనెల 24న రవీంద్రభారతిలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లకు నిర్వహించనున్న ఆత్మీయ సన్మాన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. బీసీల అభివృద్ధికి, ఐక్యతకు తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి తరఫున చేపట్టే కార్యక్రమాలకు మద్దతునివ్వాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని కులాల అబివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందని, తన వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మున్నూరు కాపుల సంక్షేమంపై సీఎం తో చర్చిస్తా

మున్నూరు కాపుల సంక్షేమంపై సీఎం తో చర్చిస్తానని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. మంత్రిని శుక్రవారం మున్నూరుకాపు సంఘం నాయకులు కలిసి సన్మానించారు. మున్నూరు కాపు కార్పొరేషన్ కు చైర్మన్ ను వెంటనే నియమించాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే దిశగా సీఎం దృష్టికి తీసుకుపోవాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి మాట్లాడుతూ కాపుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకుపోయి త్వరలోనే మున్నూరు కాపు కార్పొరేషన్ కు చైర్మన్ ను నియమించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాపుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, నాయకులు పాల్గొన్నారు.

అణచివేత పై ధిక్కార స్వరం కొండా లక్ష్మణ్

అణచివేత పై ధిక్కార స్వరం, ఉద్యమాల ఉక్కు పిడికిలి కొండా లక్ష్మణ్ బాపూజీ అని మంత్రి కొండా సురేఖ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి (ఈ నెల 21) ని పురస్కరించుకొని ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం తన జీవితాన్ని ధారపోసిన ఆయన త్యాగనిరతిని స్మరించుకున్నారు. జాతీయ ఉద్యమంలో, తొలి, మలి దశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటాల్లో, సాయుధ రైతాంగ పోరాటంలో, సహకార ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర అద్వితీయమైనదని కొనియాడారు. క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో బ్రిటిష్ రెసిడెన్సీ పై జెండా ఎగురవేసినా, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన, 96 ఏళ్ల వయసులో తెలంగాణ కోసం దీక్ష చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీకి మాత్రమే సాధ్యమైందని అన్నారు.

విప్లవ పంథాను అనుసరించటంలోనూ, పార్లమెంటరీ పంథాలో సాగటంలోనూ కొండా లక్ష్మణ్ సఫలీకృతులయ్యారని తెలిపారు. కొండా లక్ష్మణ్ ఆధ్వర్యంలోనే దేశంలోనే ప్రప్రథమంగా సహకార సంఘాలు పురుడు పోసుకోవడం ఆయన పనితీరుకు నిదర్శనమన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు తెలంగాణ ప్రభుత్వం నిబద్ధతతో కృషి చేస్తున్నదని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కి సీఎం... కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టి వారికి ఘనమైన నివాళులు అర్పించారన్నారు. తెలంగాణ వాదానికి మారుపేరైనా కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజల గుండెల్లో సదా కొలువై ఉంటారన్నారు.


Similar News