తాగు నీటి సమస్యలపై మంత్రి సీతక్క సమీక్ష

రాష్ట్రంలో ఈ వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత, తాగు నీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సీతక్క అధికారులతో భేటీ అయ్యారు.

Update: 2025-03-21 17:35 GMT
తాగు నీటి సమస్యలపై మంత్రి సీతక్క సమీక్ష
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఈ వేసవిలో ఉష్ణోగ్రతల పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో నీటి లభ్యత, తాగు నీటి సమస్యలు రాకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి సీతక్క అధికారులతో భేటీ అయ్యారు. ఈ మేరకు హైదరాబాద్​ఎర్రమంజిల్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో మంత్రి సీతక్క శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయ‌తీరాజ్ గ్రామీణాభివృద్ది సెక్రటరీ డీఎస్ లోకేష్ కుమార్, మిష‌న్ భ‌గీర‌థ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, సీఈలు, డీఈ లు హాజరైనారు. చర్చించారు. తాగు నీటి స‌మ‌స్యలు , నీటి క‌టక‌టా అంటూ ఈ మ‌ధ్య వార్త పత్రిక‌ల్లో వ‌చ్చిన క‌థ‌నాల ప‌ట్ల మంత్రి సీత‌క్క సీరియ‌స్ అయ్యారు. ఆయా క‌థ‌నాల పై అధికారుల వివ‌ర‌ణ తీసుకున్న మంత్రి సీత‌క్క మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బీఆర్ఎస్ అధికారం పోగానే తాగు నీరు రావ‌డం లేద‌నే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం రిజర్వాయర్లలో తాగు నీటి కి తగినంత నీటి నిలువలు ఉన్నాయన్నారు. గతంలో తాగునీరు అందని గ్రామాలకు కూడా ఈసారి తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.

ఆదిలాబాద్ వంటి జిల్లాల్లో ఏజెన్సీ గ్రామాల్లో బోర్లు వేసి తాగు నీరు అందిస్తున్నామని, అయినా కొందరు ప‌ని గ‌ట్టుకుని త‌ప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిష‌న్ భ‌గీర‌థ‌లో అప్పటి అధికారులు, సిబ్బందే ప‌నిచేస్తున్నారని, స‌మ‌స్యలు తలెత్తే ప‌రిస్థితే లేదన్నారు. అయినా కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదైనా సాంకేతిక కారణాలతో అవాంత‌రాలు ఏర్పడితే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తున్నామని, తాగునీటి అవసరాలకు ఇచ్చేందుకు ప్రతి జిల్లా కలెక్టర్ వద్ద రెండు కోట్ల రూపాయల నిధులను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. మిష‌న్ భ‌గీర‌థ హెడ్ ఆఫీస్ లో 24 గంట‌ల పాటు ప‌ని చేసేలా కాల్ సెంట‌ర్ ఏర్పాటు చేశామన్నారు. మిష‌న్ భ‌గీర‌థ కొత్త ప‌నుల కోసం వేయి కోట్లకు పైగా నిధులు మంజూరు చేసామని, క్షేత్ర స్థాయిలో స‌మ‌స్యలకు తక్షణం ప‌రిష్కార మార్గం చూపేలా గ్రామాల్లో మంచి నీటి స‌హాయ‌కుల‌ను నియ‌మించామని సీతక్క వెల్లడించారు. మిష‌న్ భ‌గీర‌థ అధికారులతో జిల్లా కలెక్టర్లు, శాసన సభ్యులు ఆయా జిల్లాల వారిగా స‌మావేశాలు నిర్వహించుకుంటూ అప్రమత్తంగా ఉండండని మంత్రి సీతక్క సూచించారు.

వారితో స‌మన్వయం చేసుకుంటూ తాగునీటి స‌మ‌స్యలు రాకుండా చూడాలని, ముఖ్యంగా తాగు నీటిని జాగ్రత్తగా వినియోగించుకుందామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా లో సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. బీఆర్​ఎస్​నేతల తప్పుడు ప్రచారాన్ని స్థానిక అధికారులు తిప్పి కొట్టాలని ఈ సందర్భంగా మంత్రి సీతక్క సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓ పత్రికలో పనిగట్టుకుని తప్పుడు రాతలు రాస్తున్నారని, ఆ కథనాల్లో నిజమెంతో ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వండని అధికారులకు సూచించారు. క‌థ‌నాలు త‌ప్పా? మీ నివేదిక‌లు త‌ప్పా? అన్నదీ తాము చూస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజు ఉదయం 8 గంట‌ల లోపు మంచి నీటి స‌ర‌ఫరా చేసేలా చూడాలన్నారు. ఈ వేస‌వి ముగిసే వ‌ర‌కు నిరంత‌రం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని గుర్తుంచుకోండని మిషన్​ భగీరథ అధికారులకు మంత్రి సీతక్క సూచించారు.

మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్​ సూపర్ సక్సెస్

మిషన్ భగీరథ టోల్ ఫ్రీ నెంబర్​ సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ టోల్ ఫ్రీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు కాల్ సెంటర్ కు పట్టణాల్లో నీటి సమస్య పై అందిన ఫిర్యాదులు 120 కాగా, మిషన్ భగీరథ శాఖ కు సంబంధించి అందిన ఫిర్యాదులు 434 ఉన్నాయి. ఈ 434 సమస్యల్లో పరిష్కారం అయినవి 389 కాగా, ఇంకా పరిష్కారం కావాల్సినవి 45 ఉన్నాయి. మొత్తంగా చూస్తే 90 శాతం సమస్యలకు మిషన్ భగీరథ అధికారులు పరిష్కారం చూపగలిగారు.

Tags:    

Similar News