అర్చకులతో ఎటువంటి వివాదం లేదు.. : ఈ ఓ రమాదేవి
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో అర్చకులకు, ఈ ఓ కి మధ్య వివాదం చోటుచేసుకుందని జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని రామాలయం కార్యనిర్వాహణాధికారి రమాదేవి తెలిపారు. ఈ మేరకు కల్యాణ పనులు ప్రారంభానికి అంకురార్పణ ఎందుకు ఆలస్యం అయిందో వివరిస్తూ, ఆలయ ప్రధాన అర్చకులు విజయ రాఘవ చార్యులు, స్థానాచార్యులు స్థల సాయి తో కలిసి ఒక వీడియో విడుదల చేశారు. కళ్యాణ పనులలో కీలకంగా వ్యవహరించాల్సిన బ్రహ్మ ఆలయ ఉప ప్రధాన అర్చకులు అమరావది వెంకట శ్రీనివాస రామానుజన్ ను కొన్ని కారణాలతో పర్ణశాల రామాలయం కు బదిలీ చేయడం జరిగిందన్నారు.
బ్రహ్మ లేకుండా అంకురార్పణ జరుపకూడదని వైదిక కమిటీ తెలపడంతో పరిపాలన పరంగా అనుమతులు తీసుకుని అంగీకారం తెలపడం జరిగిందని, అందుకే గురువారం సాయంత్రం అంకురార్పణ కొద్దిగా ఆలస్యం అయినా.. అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. స్థానాచార్యులు స్థలశాయి మాట్లాడుతూ, ఆలయంలో ఏడాది పొడవునా జరిగే ఉత్సవాలకు ఆచార్య, బ్రహ్మ, ఋత్విక్ లను ముందే నిర్ణయిస్తామని, ఆ సంవత్సరంలో జరిగే ప్రతి ఉత్సవం ఆచార్య, బ్రహ్మ లేకుండా నిర్వహించకూడదని ఈ ఏడాది జరిగే ఉత్సవాలకు ఆచార్య గా ప్రధాన అర్చకులు విజయ రాఘవ చార్యులు, బ్రహ్మ గా ఉప ప్రధాన అర్చకులు అమరవాది వెంకట శ్రీనివాస రామానుజం వ్యవహరిస్తారని అన్నారు. అధికారులకు ఈ విషయం అవగాహన లేకపోవడం చేత బ్రహ్మ పాల్గొనేందుకు అనుమతి ఇవ్వడం ఆలస్యం అయిందని అందుకే అంకురార్పణ కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభం అయినా వైభవంగా జరిగిందని పేర్కొన్నారు. శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం కార్యక్రమాలు కూడా కన్నుల పండువగా నిర్వహించడం జరుగుతుందని, అపోహలు నమ్మవద్దని కోరారు.