మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి : మంత్రులు ఉత్తమ్, తుమ్మల

గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో కీలకం కానుందని, సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం రాబోయే మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు.

Update: 2025-03-14 16:50 GMT
మూడేళ్లలో సీతారామ ప్రాజెక్టు పూర్తి : మంత్రులు ఉత్తమ్, తుమ్మల
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్ట్ రానున్న రోజుల్లో కీలకం కానుందని, సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణం రాబోయే మూడేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు స్పష్టం చేశారు. భవిష్యత్‌లో కృష్ణా జలాలు ఇబ్బందిగా మారితే సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు స్థిరీకరణకు సీతారామ ప్రాజెక్ట్ జీవధారగా నిలుస్తుందన్నారు. శుక్రవారం మంత్రి ఉత్తమ్ ఇంట్లో సీతారామ ప్రాజెక్టు మిగిలిన పనులపై ఇద్దరు మంత్రులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ట్రంక్, సీతారామ ప్రాజెక్ట్ పురోగతి, భూసేకరణ, ఖర్చు, నాణ్యత మరియు భవిష్యత్ ప్రణాళికలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ప్రస్తుతం సత్తుపల్లి ట్రంక్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనుల పురోగతిని సమీక్షిస్తూ, ప్రాజెక్ట్ నాణ్యత, ఖర్చుల సమీక్ష, పని వేగం తదితర అంశాలను విశ్లేషించారు. జూలూరు పాడు టన్నెల్ పూర్తయితే పాలేరు రిజర్వాయర్‌కు.. గోదావరి నీళ్ళు చేరితే భవిష్యత్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సీతారామ వర ప్రదాయనిగా మారుతుందని వివరించారు. సత్తుపల్లి ట్రంక్ పనులను ఈ సంవత్సరంలోపు పూర్తి చేయాలన్నారు. పంప్ హౌస్-4 నిర్మాణాన్ని కూడా ఈ ఏడాదిలో పూర్తిచేయాలని.. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌లను ఆదేశించారు. పనినాణ్యత, ఖర్చు నియంత్రణ, పనుల సమయపాలనపై అధికారులు, కాంట్రాక్టర్లు, సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమీక్షించి, పనులను మరింత వేగవంతం చేయాలని, ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు.

Tags:    

Similar News