భట్టి వర్సెస్ ప్రశాంత్‌రెడ్డి.. ఆరు గ్యారంటీలపై ఇద్దరి మధ్య వాగ్వాదం
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
దిశ, తెలంగాణ బ్యూరో: మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అన్ని నియోజకవర్గాల్లోనూ సంక్షేమ అమలు చేస్తున్నామని భట్టి మాట్లాడగా.. ఆరు గ్యారెంటీలు అమలు కావడం లేదని బీఆర్ఎస్ సభ్యులు వాదించారు. ఏం చేశారో చెప్పండి అని ప్రశాంత్‌రెడ్డి నిలదీశారు. ఫ్రీ కరెంట్‌కు సంబంధించి బాల్కొండ నియోజకవర్గం, సిద్దిపేట, సిరిసిల్ల పలు నియోజకవర్గాల వివరాలను భట్టి వెల్లడించారు. చేసిన పనిని తాము చెప్పుకోలేకపోతున్నామని.. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి వివరిస్తున్నామని అన్నారు.
అయితే.. ఇదే క్రమంలో బాల్కొండ నియోజకవర్గంలో రుణమాఫీపై ఇద్దరి మధ్య డిస్కస్ జరిగింది. బాల్కొండ నియోజకవర్గంలో 51వేల మందికి రుణమాఫీ కావాల్సి ఉందని.. కానీ, 20 వేల మందికే అయిందని.. అవసరమైతే లెక్కలు తెప్పించుకొని చూడాలని ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. గవర్నర్ ప్రసంగంపై సీఎం రిప్లె ఇవ్వాలి కానీ భట్టి ఇస్తున్నారని.. ఆయన క్రెడిట్ ఈయన కొట్టేస్తున్నారా..? అని ప్రశ్నించారు. అయినా వాళ్ల పంచాయితీ మాకెందుకు..? అంటూనే హామీలపై నిలదీశారు. 15నెలలుగా తమ మీద పడి ఏడుస్తున్నారని.. ప్రజలు అవకాశం ఇచ్చినందుకు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నదో వెల్లడించాలని డిమాండ్ చేశారు.