వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులు... మంత్రి తుమ్మల కీలక ప్రకటన
వ్యవసాయంలో సాంకేతిక పద్ధతులపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన చేశారు..

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో పంటలు అంతర్జాతీయ ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పండించే విధంగా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించించారు. దీంతో ఎగుమతులు పెరిగి రైతులకు అధిక ధరలు పొందుతారని తెలిపారు. దీనికి జర్మనీ ప్రభుత్వంతో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం కలసి ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి అవకాశాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను అందించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. గురువారం జర్మనీ ప్రతినిధుల బృందంతో సచివాలయంలో సమావేశమైయ్యారు. ఈసందర్బంగా వ్యవసాయ రంగంలో నూతన సాంకేతికతల అన్వయం, మార్కెటింగ్, డిజిటల్ వ్యవసాయ అభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో పైలట్ ప్రాతిపదికన హెచ్హెచ్ఐ , జర్మనీ సంస్థ సహకారంతో నిర్వహిస్తున్న పరిశోధన గురించి బృందసభ్యులకు వివరించారు. ఈ పరిశోధనలో భాగంగా మూడు ఎఫ్పిఓల నుంచి 55 మంది రైతులను ఎంపిక చేసి, ఉత్పత్తి ఖర్చులను తగ్గించడం, సాంకేతికతను ఉపయోగించి కూలీ ఖర్చు తగ్గించడం, డిజిటల్ వ్యవసాయం, పంట దిగుబడులను పెంచడం, డ్రోన్లను ఉపయోగించి చెప్పారు. నేల సారాన్ని పరీక్షించడం, వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి వాతావరణ స్టేషన్ ను నిర్వహిస్తూ, రైతులకు ఎప్పటికప్పుడు వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందచేయడం జరుగుతుందని పేర్కొన్నారు.
నూతన వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించడం ద్వారా కూలీల కొరతను అధిగమించడమే కాకుండా, అధిక దిగుబడులు రైతులు పొందే విధంగా సాంకేతికతను అనుసంధానం చేయాలన్నారు. ప్రస్తుతం దేశంలో జర్మన్ సహకారంతో రాజస్థాన్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వివిధ ప్రాజెక్ట్ లు ప్రగతిలో ఉన్నాయని బృంద సభ్యులు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక అధ్యయన బృందాన్ని ఈ రాష్ట్రాలకు పంపి వాటి ఫలితాలను అధ్యయనం చేసి తెలంగాణ రైతులను కూడా అక్కడికి పంపించి వారికి శిక్షణ ఇచ్చి, పంట ఉత్పత్తులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే విధంగా చూడాలన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, అగ్రికల్చర్హబ్వంటి సంస్థలు, డిజిటల్ వ్యవసాయాన్ని తెలంగాణ రైతులకు అందించేందుకు పనిచేయలన్నారు. ఏసీఆర్ఏటీ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ రైతులకు అధునాతన వ్యవసాయ విధానాల ప్రయోజనాలు అందించేందుకు ఇది ఒక గొప్ప అవకాశమని మంత్రి తెలిపారు. ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన అనుభవాలను విస్తృతంగా చేసేందుకు వ్యవసాయ శాఖ సంపూర్ణ సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఇండో-జర్మన్ వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేసేందుకు, తెలంగాణలో స్థిరమైన వ్యవసాయ అభివృద్ధికి దోహదపడే కీలక ముందడుగు అని తెలుపుతూ, సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జర్మన్ ప్రతినిధులైన డా. రఘు చలిగంటి, శాస్త్రవేత్త (డిజిటల్ అగ్రికల్చర్), ఫ్రౌన్హోఫర్, డా. సెబాస్టియన్, హెడ్- టెలికమ్యూనికేషన్స్, ఫ్రౌన్హోఫర్, మార్టిన్, రాష్ట్రం నుండి డా. బి. గోపీ, సురేంద్ర మోహన్ , శ్రీ ఎన్. శ్రీధర్, ప్రొ. అల్దాస్ జనయ్య తదితరులు పాల్గొన్నారు.