CM Revanth Reddy: డీలిమిటేషన్ పై బీజేపీని అడ్డుకోవాలి: రేవంత్ రెడ్డి
.చెన్నై ఆల్ పార్టీ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెట్స్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థంగా అమలు చేశాం.. మంచి పని చేసిన మాకు శిక్ష వేస్తారా? అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. న్యాయబద్ధం కానీ డీలిమిటేషన్‌పై మనమంతా బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ సీట్ల డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన పలు రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న అంశంపై ఇవాళ చెన్నయ్‌లో డీఎంకే ఆధ్వర్యంలో జేఏసీ (JAC) తొలి సమావేశం జరుగుతోంది. హోటల్ ఐటీసీ చోళలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (M.K Stalin) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై మాట్లాడారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించదన్నారు. గతంలో వాజ్‌పేయి (Vajpayee) లోక్‌సభ సీట్లు పెంచకుండానే డీలిమిటేషన్ చేశారని, ఇప్పుడు మోడీ (Narendra Modi) కూడా అదే పని చేయాలన్నారు. డీలిమిటేషన్‌లో శాస్త్రీయమైన పద్ధతి అవలంభించాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు నిధుల్లో సరైన వాటా రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక అభివృద్ధి జీడీపీ, ఉద్యోగ కల్పనతో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయి. దేశానికి దక్షిణాది రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ మనకు తిరిగి వచ్చేది తక్కువ అని అన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి కేంద్రం తిరిగి ఇచ్చేది కేవలం 42 పైసలు మాత్రమే అని అన్నారు. అదే బిహార్ రూపాయి పన్ను కడితే వచ్చేది ఆరు రూపాయలు వస్తున్నాయని, యూపీకి రూపాయికి 2 రూపాయలు వస్తున్నాయని ఆరోపించారు. లోక్‌సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలని కోరారు.
దేశం ఎవరి సొత్తు కాదు: స్టాలిన్
జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలకు నష్టం వాటిళ్లకుండా న్యాయమైన డీలిమిటేషన్ (Delimitation) సాధించే వరకు మనమంతా ఐక్యంగా ఉండి పోరాడుదామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్‌కు తాము వ్యతిరేకం కాదని.. న్యాయబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టాలనే తాము డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్రం ఆలోచన ప్రకారం ప్రస్తుత జనాభా ఆధారంగా పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు చట్టాల రూపకల్పనలో ప్రాతినిధ్యం తగ్గుతుందని దాంతో దక్షిణాది రాష్ట్రాల రాజకీయ శక్తిని బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా నిరసనలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలను అణచివేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని, అన్ని వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా దేశానికి స్వాతంత్రం వచ్చిందని.. ఈ దేశం ఎవరి సొత్తు కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయని, డీలిమిటేషన్‌తో సౌత్ స్టేట్స్ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.
చంద్రబాబు, మమతా బెనర్జీ డుమ్మా
ఇవాళ జరిగే సమావేశానికి రావాలని కోరుతూ ఈ నెల 7వ తేదీన రేవంత్‌రెడ్డి, చంద్రబాబుతో సహా 7 రాష్ట్రాల సీఎంలకు 29 పార్టీల అధినేతలకు డీఎంకే అధినేత స్టాలిన్ లేఖ రాశారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఎంపీ మల్లురవి, బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ ఎంపీ వినోద్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే పంజాబ్, కేరళ రాష్ట్రాల సీఎంలు భగవంత్‌మాన్, పినరయ్ విజయన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు బల్వీందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఈ మీటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఆ పార్టీ ప్రతినిధులు సైతం దూరంగా ఉన్నారు.
డీలిమిటేషన్వద్దు: జగన్
ఇప్పటి జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేస్తే దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గుతాయని, జనాభా ప్రాతిపదికన కాకుండా డీలిమిటేషన్ చేయాలని ప్రధాని మోడీని ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (Jagan) కోరారు. ఈ మేరకు మోడీకి ఆయన ఇవాళ లేఖ రాశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. 2026లో జరిగే డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన నెలకొందన్నారు. దీని వల్ల ఎంపీ సీట్లు తగ్గుతాయని చర్చ జరుగుతుందని పేర్కొన్నారు. డీలిమిటేషన్‌కు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవద్దని జగన్కోరారు. ప్రధానికి జగన్ లేఖ రాయడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.