పర్ణశాలలో ఫాల్గుణ పౌర్ణమి ఉత్సవాల ఘన శోభ
పర్ణశాల ధర్మక్షేత్రంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దివ్యమైన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.

దిశ,దుమ్ముగూడెం : పర్ణశాల ధర్మక్షేత్రంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం దివ్యమైన వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. శ్రీ స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, పసుపు కొట్టుట, కళ్యాణక్షతలు కలుపుట, అనంతరం వసంతోత్సవం, విశేష స్నపనం నిర్వహించి భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించారు. ఈ పవిత్ర కార్యక్రమానికి భద్రాచలం ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రాగా.. తిరుపతి నుంచి ప్రత్యేక సేవా బృందం కూడా హాజరై, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంది. మొత్తం 200 మందికి పైగా భక్తులు ఈ మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఆలయ పరిపాలనాధికారులు సంప్రదాయబద్ధంగా ఉత్సవాలను నిర్వహించి, భక్తులకు స్వామివారి దర్శనం అందేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ఇంచార్జ్ అనిల్ కుమార్, ముఖ్య అర్చకులు కిరణ్ కుమార్ ఆచార్యులు, ప్రతాపం భార్గవాచార్యులు, నరసింహాచార్యులు, వెంకట ఆచార్యులు ఈ ఉత్సవాల్లో పాల్గొని దైవ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, ఈ రోజు నుండి శ్రీరామనవమి ఉత్సవ పనులు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలిపారు. పర్ణశాల ఈ ఉత్సవం తో భక్తిమయంగా మారి, రామనామ స్మరణతో మారుమ్రోగింది.