బిఎల్ఓ యాప్ పై అవగాహన కల్పించాలి : కలెక్టర్
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్,
దిశ, కొత్తగూడెం : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశం మందిరంలో జిల్లాలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నాయకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ఎన్నికల నిర్వహణ, ఓటరు జాబితా రూపకల్పన, ఓటరు జాబితా సంబంధిత ఫారాలు 6,7,8 లపై రాజకీయ పార్టీ నాయకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించాలని, బూత్ లెవెల్ ఏజెంట్లు జాబితా పార్టీ జిల్లా ఇంచార్జ్ ధ్రువీకరణ చేసి అందించాలని కలెక్టర్ సూచించారు. రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణకు పోలింగ్ బూతులు, ఓటరు జాబితాలో ఏదైనా సమస్యలు ఉంటే సూచించాలని వాటిని పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.
ఓటరు జాబితాలో నూతన ఓటరు నమోదు, తప్పుల సవరణ, ఓటర్ తొలగింపు తదితర అంశాలపై రాజకీయ పార్టీలకు పూర్తి అవగాహన అవసరమని ఆయన తెలిపారు. ఫామ్ 6 దరఖాస్తు ద్వారా నూతనంగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఫామ్ 7 ద్వారా తొలగింపు, అభ్యంతరాలు పై దరఖాస్తు చేసుకోవచ్చని, వచ్చిన దరఖాస్తులను బి ఎల్ వో లు విచారణ చేపట్టి, నోటీసులు జారీ చేసిన తర్వాత మాత్రమే తొలగింపు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఫామ్ 8 ద్వారా తప్పుల సవరణ, ఫోటో మార్పు, ఓట్ షిఫ్టింగ్ తదితర సేవలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
జిల్లావ్యాప్తంగా ఫామ్ 6,7, 8 లలో 19,514 దరఖాస్తులు రాగా అందులో 10944 దరఖాస్తులు పరిష్కరించబడ్డాయని,1,310 దరఖాస్తులు తిరస్కరించబడ్డాయని, 7,260 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని కలెక్టర్ వివరించారు. ఓటర్లు నూతన ఓటు హక్కు రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పులు తదితర సేవలకు ఎక్కడకు తిరిగే అవసరం లేకుండా బిఎల్ఓ యాప్ ద్వారా అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని, రాజకీయ పార్టీ నాయకులకు వచ్చే శనివారం బి ఎల్ ఓ యాప్ నిర్వహణపై శిక్షణ తరగతులు నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ఓటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని కలెక్టర్ అన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సూపర్డెంట్ ధారా ప్రసాద్, నేషనల్ కాంగ్రెస్, బి ఆర్ ఎస్ , బిజెపి,సిపిఐ, సిపిఎం రాజకీయ పార్టీల అధ్యక్షులు, కార్యదర్శులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.