జాతీయ రహదారి వెంబడి పెట్రోల్ బంకుకు అక్రమ మట్టి రవాణా
కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా రెచ్చిపోతుంది.
దిశ కూసుమంచి రూరల్ : కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మట్టి మాఫియా రాత్రి పగలు తేడా లేకుండా రెచ్చిపోతుంది. రెవెన్యూ అధికారుల అండదండలతో? మట్టి మాఫియా రెచ్చిపోయి అక్రమార్కులు తమ అక్రమ మట్టి దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఈ మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంలో అటు మైనింగ్, ఇటు రెవెన్యూ అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారనే విమర్శలు మండలంలో వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే కూసుమంచి మండలంలోని గురువాయి గూడెం గ్రామ శివారు చెరువు సమీపంలో రైతుల ల్యాండ్ డెవలప్మెంట్ పేరిట సుమారు 20 అడుగుల లోతు మట్టిని జేసీబీల సహాయంతో ట్రాక్టర్ ల ద్వారా కూసుమంచి గ్రామ శివారు ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి వెంబడి ఓ పెట్రోల్ బంకు నిర్మాణానికి లక్షలాది రూపాయలు విలువజేసే విలువైన మట్టిని ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా ట్రాక్టర్ ల ద్వారా తరలిస్తూ కొన్ని గంటల్లోనే లక్షలు గడిస్తూ అక్రమ మట్టి దందాను కొనసాగిస్తున్నారు.
ఇది వారికి నిరంతరం దినచర్యగా మారిపోయింది. ఆదివారం,పండుగ దినాలు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు రోజులను అదునుగా చేసుకొని రెచ్చిపోతున్నారు. అడ్డుకోవాల్సిన రెవెన్యూ శాఖ, మైనింగ్ అధికారులు మట్టి మాఫియాతో కుమ్మకై అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి..! రైతుల పేరుతో,ల్యాండ్ డెవలప్మెంట్ పేరుతో మట్టి మాఫియా రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులకు పట్టాదారు పాస్ పుస్తకం ఉన్నా, పిడికెడు మట్టి రోడ్డు ఎక్కాలన్నా రెవెన్యూ లేదా మైనింగ్ అధికారుల అనుమతి ఉండాలనే విషయం రెవెన్యూ అధికారులకు తెలిసిందే.
ట్రాక్టర్ ట్రిప్పుకు రూ రూ.800 నుంచి రూ.1000 వసులు
కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో సేకరించిన మట్టిని పరిసర ప్రాంతాల్లో జాతీయ రహదారి వెంట వెలుస్తున్న వెంచర్లకు, వివిధ ప్రైవేటు వ్యాపార భవన సముదాయాలకు ట్రిప్పుకు 800 నుంచి రూ. 1000 లకు జేసీబిల సహాయంతో ట్రాక్టర్ ల ద్వారా అక్రమంగా మట్టిని తరలించి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. రాత్రి పగలు వేళల్లో జెసిబిల సహాయంతో, లారీ మాన్ ట్రిప్పులతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని మట్టి మాఫియతో కుమ్మక్కు కావడంతోనే అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు పలు గ్రామల్లో వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా మైనింగ్,రెవెన్యూ అధికారులు, సంబంధిత శాఖ అధికారులు జోక్యం చేసుకొని అక్రమ మట్టి దందాను అరికట్టి ప్రభుత్వానికి రాబడి తేవాలని ప్రజల కోరుతున్నారు.
తహసీల్దార్ కరుణా శ్రీ వివరణ
శనివారం గురువాయిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో పట్టా ల్యాండ్ కలిగిన ఓ రైతు భూమిలో ల్యాండ్ డెవలప్మెంట్ పేరుతో అక్రమంగా తరలిస్తున్న మట్టి,రెవెన్యూ అధికారులకు అందుతున్న ముడుపుల పై వివరణ కోరగా రెవెన్యూ వారు ఎవరి దగ్గర ముడుపులు తీసుకోవడం లేదని, సమాచారం వచ్చిన వెంటనే మట్టి తరలించే ప్రదేశానికి వెళ్ళామని, సదరు అక్రమ మట్టి వ్యాపారులపై తమ సిబ్బందిని పంపించి చర్యలు తీసుకున్నామన్నారు. మండలంలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పట్టా ల్యాండ్ అయిన, ప్రభుత్వ ల్యాండ్ అయిన సరే పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటామని కూసుమంచి తహసీల్దార్ కరుణా శ్రీ తెలిపారు.